మినీపురపోరు ప్రచారం సందర్భంగా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రజారోగ్య సంచాలకులు, ఎన్నికల పరిశీలకులు సమీక్షలో పాల్గొన్నారు.
ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే చేయాలన్న పార్థసారథి... 27వ తేదీ లోగా వందశాతం ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి వార్డుకు ఒక వైద్యాధికారిని నోడల్ అధికారిగా నియమించాలన్న ఎస్ఈసీ... ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఏఎన్ఎం, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లను నియమించి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని తెలిపారు.
మాస్కు ధరించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అనుమతించాలని పార్థసారథి స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రం వెలుపల, లోపల భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్న ఆయన... ఓటర్ల కోసం షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి పోలింగ్, పోలీసు సిబ్బందికి మాస్కు, ఫేస్ షీల్డ్, శానిటైజర్, చేతి గ్లౌజులను ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం, ఫర్నీచర్‌ను ముందు రోజే శానిటైజ్ చేయడంతో పాటు కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వరాదన్న ఎస్ఈసీ... 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రచారంపై నిషేధం అమలవుతుందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిగా అమలయ్యేలా చూడాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి... సంఘవిద్రోహ శక్తులను బైండోవర్ చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి