యాజమాన్యం, ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలకు పోకుండా చర్చల ద్వారా సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని టీఎస్ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సమస్యను జఠిలం చేసి సమ్మెను ఏవిధంగా అణచివేయాలనే దిశగా ఆలోచించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే ఆఖరి పోరాటం కావాలని అన్నారు. సమ్మె సన్నాహకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్ఎం కార్యాలయాల వద్ద సామూహిక నిరహారదీక్షలు చేయాలని జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి రీజియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు సామూహిక నిరాహారదీక్ష చేసిన ఆర్టీసీ కార్మికులకు... ఐకాస నాయకులు నిమ్మరసం ఇచ్చి ఒక్కరోజు దీక్ష విరమింపజేశారు.
ఇదీ చూడండి: తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!