గిరిజన సహకార సంస్థను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఉత్పత్తులను మరిన్ని పెంచాలని, నాణ్యతలో రాజీ పడవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. హైదరాబాద్‌లో అధికారులతో సమావేశమై జీసీసీ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. ఈ ఏడాది 300 కోట్ల టర్నోవర్ లక్ష్యంతో ఉన్నట్లు మంత్రి సత్యవతి వెల్లడించారు. జీసీసీ ఉత్పత్తులు అత్యంత ఉత్తమనాణ్యతతో ఉన్నందున ఏ1 గుర్తింపు వచ్చిందన్నారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు గిరిజన ఉత్పత్తులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఐటీడీఏ పరిధిలో రూ.10 కోట్ల ఆర్థిక సాయం
ఐటీడీఏ పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో సబ్బుల తయారీ సంస్థలను మరిన్ని పెంచుతున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ఈ ఏడాది దోమ నివారణ మందును, లిప్‌బామ్, అల్లోవెర జెల్ వంటి ఉత్పత్తులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు స్థానిక గిరిజన రైతుల నుంచి ముడి సరుకులు తీసుకుని మిల్లెట్స్, చిక్కీల వంటి ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల్లో ఆర్థిక సాయం చేసేందుకు వివిధ కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయని, ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు ఓ కంపెనీ ముందుకు వచ్చిందని చెప్పారు.
ఇదీ చూడండి: విత్తన చట్టం అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారాలి'