Revanth Reddy Comments: జనం మధ్య గంజాయి తాగొద్దని వారించినందుకు కాంగ్రెస్ నేతను తెరాస గుండాలు కొట్టి చంపారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పాలన ఎటు పోతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది తెరాస గుండాలను ప్రజల మధ్య గంజాయి తాగొద్దని వారించేందుకు వెళ్తే.. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నరసింహారెడ్డిపై కట్టెలు, రాడ్లతో దాడి చేసి హతమార్చారని ఆయన ఆరోపించారు.
అరెస్ట్ చేయకపోతే ఉద్యమమే..
గంజాయి అక్రమ రవాణపై ప్రభుత్వం తీసుకునే చర్యలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోంది తప్ప.. కార్యాచరణ లేదని ధ్వజమెత్తారు. కేకే గార్డెన్‌లో గతరాత్రి గంజాయి సేవిస్తున్న వారిని వద్దని చెప్పినందుకు నర్సింహారెడ్డిని హత్య చేస్తే.. మద్యం మత్తులో జరిగిన గొడవల్లో మృతి చెందినట్లు చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.
50 లక్షల పరిహారం ఇవ్వాలి...
గతంలో సింగరేణి కాలనీలో గంజాయి మత్తులో చిన్నారిని హతమార్చిన ఘటన మరవకముందే మరొకటి జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారాన్నిఇవ్వాలని.. గాయాలు తగిలిన వారికి మెరుగైన వైద్యం అందేట్లు చూడాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: