Relationship Advice for Married Couple : కష్టాలొచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా, చేయూతగా ఉండే దాంపత్యంలో భార్యాభర్తా మానసికంగా ఒకటిగా మారి, మరింత బలంగా ఉంటారు. ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోగలుగుతారు. కొందరు ఒకరిపై మరొకరు ప్రేమగా ఉంటున్నట్లుగా కనిపిస్తూ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే భాగస్వామిని విమర్శిస్తారు. నా మాట విని ఉంటే పరిస్థితి అక్కడివరకు వచ్చేది కాదంటూ నిందలు మోపడానికి కూడా వెనుకాడరు. అటువంటి వారి మనసులో సహచరుడు లేదా సహచరిపై తక్కువభావం ఉన్నట్లే.
అదే ఎదుటి వారిపై గౌరవం ఉంటే, సమస్యను దాటడానికి ఆలోచన పంచుకొని ఇరువురూ ఒకే మాటపై నడవడానికి సిద్ధపడతారు. అలాంటి జంట మధ్య బలమైన బంధం ఉన్నట్లే. భాగస్వామి తమ పక్కన ఉంటే చాలు, కొండంత ధైర్యం అనుకుంటూ ఒత్తిడికి దూరంగా, ప్రశాంతమైన మనసుతో ఉండగలిగితే ఆ ఇద్దరి మధ్య నిజమైన ప్రేమబంధం పెనవేసుకున్నట్లే.
ప్రోత్సాహం.. కెరియర్‌లో ఎదిగే అవకాశం వచ్చినప్పుడు, లేదా భాగస్వామి తన ఆశయం, అభిరుచిని చెప్పినప్పుడు ఎదుటివారు ప్రోత్సహించాలి. అలాకాక నీవల్ల కాదు అని నిరుత్సాహపరిస్తే ఆ ఇద్దరి మధ్య అసలైన ప్రేమ లేనట్లే. నిజంగా అవతలి వ్యక్తిని ప్రేమిస్తే, వారు ఎదగాలనే ఆలోచన వస్తుంది. అప్పుడే ఆ దంపతుల మధ్య ప్రేమబంధం ఉన్నట్లు. అవతలి వారి నైపుణ్యాలు, ప్రత్యేకతలను గుర్తించి, అవసరమైనప్పుడు చేయూతనిచ్చే భాగస్వామి ఉంటే ఆ దాంపత్యం కలకాలం సంతోషంగా ఉంటుంది. ఆ భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవ మర్యాదలిచ్చుకుంటూ.. అనురాగంతో కలిసి ఉంటారు. అదే నిజమైన ప్రేమబంధమవుతుంది. అలాకాక ఎదుటి వారిలో లోపాలను మాత్రం ఎత్తిచూపి విమర్శిస్తూ ఆత్మన్యూనతకు గురిచేసే భాగస్వామి ఉంటే మాత్రం ఆ బంధం బలహీనపడటం తప్పదు.