తెలంగాణలో పురపాలక పట్టణాలు, నగరాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.నగరాల్లో 70 శాతం.. పురపాలక సంఘాల్లో 80-85 శాతం ఆస్తులు నమోదయ్యాయి. చాలాచోట్ల సోమవారం నాటికి దాదాపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కరీంనగర్ పురపాలక సిబ్బంది ఇళ్ల నుంచి సమాచారం సేకరించడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకూ నమోదు చేసుకోని వారు నేరుగా పురపాలక కార్యాలయానికి వివరాలతో వస్తే అక్కడికక్కడ నమోదు చేస్తున్నారు.
నమోదు కాని ఆస్తులపై ప్రత్యేక దృష్టి
ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య ఉండి నమోదు కాని ఆస్తులను ప్రత్యేకంగా గుర్తించనున్నారు. ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోవడం, కొందరు వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో నమోదుపై ప్రభావం పడుతోందని పురపాలక అధికారులు పేర్కొంటున్నారు. విక్రయాలు జరిగి మ్యుటేషన్ కాని వాటిని, యజమానులు విదేశాల్లో ఉన్నవారు, ఆధార్ గుర్తింపు సంఖ్యలేని వారు, ఇంటి నంబరు లేనివారు ఎందరున్నారనేది రెండు రోజుల్లో తేలుతుందని పురపాలకశాఖ అధికారులు తెలిపారు. దీని ఆధారంగా ప్రభుత్వాదేశాల మేరకు వ్యవహరించనున్నట్లు చెప్పారు.
సోమవారం ఈ ప్రక్రియను పురపాలకశాఖ ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల నమోదును పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈనెల 20 వరకూ గడువు ఇచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అమీన్‌పూర్ లాంటి పురపాలక సంఘాలు సహా ఇతర ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో నమోదు ప్రక్రియ 50 శాతం వరకే సాగింది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మంగళవారానికి పట్టణాలు, నగరాల్లో దాదాపు ఆస్తుల నమోదు పూర్తవుతుందని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగుతోందన్నారు.