రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సకాలంలోనే ప్రవేశించాయి. జూన్ 11న రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చినా.. వర్షాలు మాత్రం జూన్ తొలి వారం నుంచే ప్రారంభమయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కన్నా 45 శాతం అధికంగా నమోదైంది. గత పదేళ్లలోనే రికార్డు స్థాయిలో 45 శాతం సగటు వర్షపాతం రికార్డు అయింది. అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 130, వనపర్తిలో 126 శాతం వర్షపాతం నమోదైంది.
45 శాతం సగటు వర్షపాతం..
జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సీజన్‌లో 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. జూన్ 9న ఒక అల్పపీడనం, జూలై 5న మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగస్టులో ఏకంగా 5 అల్పపీడనాలు సంభవించాయి. 4, 9, 13, 19, 24 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో 13, 20 తేదీల్లో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. 2010లో 32 శాతం.. 2020లో 45 శాతం సగటు వర్షపాతం అధికంగా ఉంది.
జిల్లాల్లో..
తెలంగాణలో ఈ సీజన్‌లో ఆదిలాబాద్ +2, భద్రాద్రి కొత్తగూడెం +83, హైదరాబాద్ +29, జయశంకర్ భూపాలపల్లి +62, జగిత్యాల +13, జనగామ+ 52, జోగులాంబ గద్వాల +92, కామారెడ్డి +27, కరీంనగర్ +76, ఖమ్మం +36, కుమురం భీం ఆసిఫాబాద్ +16, మేడ్చల్ మల్కాజిగిరి +33, మహబూబాబాద్ +106, మహాబూబ్‌నగర్ +85, మంచిర్యాల +17, మెదక్ +24, నాగర్‌కర్నూల్ +75, నల్గొండ +18, నిర్మల్ -10, నిజామాబాద్ +4, పెద్దపల్లి +30, రాజన్న సిరిసిల్ల +57, రంగారెడ్డి +39, సంగారెడ్డి +13, సిద్ధిపేట +93, సూర్యాపేట +34, వికారాబాద్ +31, వరంగల్ గ్రామీణ జిల్లా +88, యాదాద్రి భువనగిరి జిల్లాలో +52గా వర్షపాతం నమోదైంది.
ఏపీలో..
కోస్తాంధ్రాలో 24 శాతం వర్షపాతం నమోదయింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే 25 శాతం లోటు నెలకొంది. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం.. సాధారణం కన్నా అధిక వర్షపాతంగా రికార్డు అయింది. రాయలసీమలో సాధారణం కన్నా 84 శాతం అధికంగా నమోదైంది. కడప జిల్లాలో 110 శాతం సాధారణం కన్నా అధికంగా రికార్డు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏపీలోని తూర్పు గోదావరి +33, గుంటూరు + 53, కృష్ణా +24, నెల్లూరు +58, ప్రకాశం +42, విశాఖపట్నం -8, విజయనగరం -6, పశ్చిమ గోదావరి +38, యానాం +21, అనంతపురం +84, చిత్తూరు +70, కర్నూల్ +74గా నమోదైంది.
నైరుతి రుతుపవనాల సమయంలో తొమ్మిది అల్పపీడనాలతో పాటు షీర్‌జోన్స్ ఎక్కువగా ఏర్పడటం వల్ల దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడం సహా భారీ నుంచి అతి భారీవర్షాలు పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇవీచూడండి: ఎన్నో ఏళ్ల తరువాత.. మళ్లీ కనువిందు చేస్తున్న జలపాతం