Rains in telangana Toady: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 10 గంటల వ్యవధిలోనే మెదక్ జిల్లా టేక్మాలులో 16 సెంటీమీటర్ల వర్షంకురిసింది. కొల్చారంలో 15 సెంటీమీటర్లు, అల్లాదుర్గంలో 15, సర్దనలో13, రేగోడు, ఎల్లారెడ్డిపేటలో 12 సెంటీమీటర్లు పడింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల వ్యవధిలో భద్రాద్రి సీతారామపట్నంలో 23.9, కరీంనగర్ పోచంపల్లిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరపిలేని వర్షాలకు... కొన్ని జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న, వరి, సోయాచిక్కుడు తదితర పంటచేలల్లో నీళ్లు నిలిచాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా పరవళ్లు తొక్కుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.ఆలయం లోపలికి ప్రవేశించకుండా... వరదప్రవాహం కొనసాగుతోంది. హన్మకొండ జిల్లా పరకాలలోచలివాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. పరకాల, మొగుళ్ళపల్లి ప్రధాన రహదారి నాగారం వద్ద లోలెవెల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గొర్రెలు వరదలో కొట్టుకుపోయాయి. హనుమకొండలో..పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో పిడుగుపడి మహిళా రైతు రమ మృత్యువాత పడ్డారు. నాట్లు వేసి ఇంటికి వస్తుండగా పిడిగుపాటుకు గురై మృతిచెందింది. నల్గొండ జిల్లా డిండి జలాశయం వద్ద పోటో దిగుతూ కాలుజారిపడి హైదరాబాద్‌కు చెందిన మనోజ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉంటూ పోటోగ్రాఫర్‌గా శిక్షణ తీసుకుంటున్నాడు. శ్రీశైలం వెళ్లి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా నదికి కర్ణాటకలోని ఆలమట్టి నుంచి... ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వరకు ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లు, నాగార్జునసాగర్ 22 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉప నదుల నుంచి గోదావరికి వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్, సింగూరు, మానేరు జలాశయాలకు ప్రవాహం పెరగడంతో గేట్లు తెరిచి గోదావరికి విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌కు వరద పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి, కాళేశ్వరం ఎత్తిపోతల్లోని 3 బ్యారేజీల గేట్లు తెరుచుకున్నాయి. వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఉస్మాన్‌సాగర్‌కు 2 వేల క్యూసెక్కులు వస్తుంటే 6 గేట్ల ద్వారా 2106 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌కు 600 క్యూసెక్కులు వస్తుంటే.... రెండు గేట్లు ద్వారా 678 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడ అతిభారీగా, సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఇవీ చదవండి: