Rabbits And Calf House: కరోనా కారణంగా గత రెండేళ్లుగా పాఠశాలలకు సెలవులు వచ్చాయి. ఆ సమయంలో చిన్నారులకు చదువులు చెప్పడం, వారి అల్లరిని భరించడం తల్లిదండ్రులకు పెద్ద పనిగానే మారిందని చెప్పాలి. ఇలాంటి అల్లరి పిల్లల కోవకి చెందిన వారే ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకి చెందిన ఇద్దరు అమ్మాయిలు శివ నాగ సమీరా, శివ జ్యోతిక. కొవిడ్‌తో పాఠశాలలు మూసివేయడం వల్ల ఇంటి వద్దే ఉంటూ చదువుతో పాటు ఆటలు పాటలూ కొనసాగించారు. చదువు సంధ్యలతో పాటుగా అల్లరిలోనూ ముందున్నారు. పిల్లల దృష్టి అల్లరిపై నుంచి మరల్చేందుకు వారి కోసం రెండు బుజ్జి బుజ్జి.. ముద్దు ముద్దు కుందేలు పిల్లల్ని తెచ్చారు సమీరా, జ్యోతికల తండ్రి గోనుగంట సుబ్బారావు.
జంతుప్రేమికులుగా మారిపోయిన చిన్నారులు
కొత్తగా వచ్చిన నేస్తాలతో ఆడుతూ.. వాటిని అల్లారుముద్దుగా పెంచుతూ వారి నాన్నలాగే సమీరా, జ్యోతిక జంతు ప్రేమికులుగా మారిపోయారు. రెండేళ్లలో మొత్తం 50కి పైగా కుందేళ్లను పెంచుతూ జంతు ప్రేమను చాటుతున్నారు. అంతేనా కేవలం కుందేళ్లే కాదు వీరి ఇంట్లో ఆవు దూడలూ ఉన్నాయి. కుందేళ్లు, దూడలు కలిసి మెలిసి పచ్చిక తింటూ..ఎంతో స్నేహంగా మెలుగుతాయి.
కుందేళ్లు, లేగ దూడలు తమ కుటుంబ సభ్యుల్లా మారిపోయాయని ఎంతో సంతోషంగా చెబుతారు వారంతా. జంతువులపై తనకున్న ప్రేమతోనే వాటిని పెంచుతున్నట్లు సుబ్బారావు చెబుతున్నారు. వారి ఇంట్లో పెరుగుతున్న దూడలు, కుందేళ్లను చూడటానికి.. వాటితో ఆడుకోవడానికి ఇరుగుపొరుగు చిన్నారులు పోటీపడుతుంటారని చెబుతున్నారు.
" మొదటి నుంచి మాకు జంతువులంటే చాలా ప్రేమ. అందుకే ఆవులు, కుందేళ్లను పెంచుతున్నాం. ప్రతీ ఒక్కరూ జంతువుల పట్ల ప్రేమగా ఉంటూ.. ఇంటికి ఒక ఆవునైనా పెంచాలని కోరుతున్నాం."
- గోనుగంట సుబ్బారావు, జంతు ప్రేమికుడు
ఇదీ చదవండి :