ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తమిళనాడులో డీఎంకేని, బంగాల్లో టీఎంసీని విజయతీరాలకు చేర్చటం వెనుక ఆయన వ్యూహం కూడా ఉందనేది అందరికీ తెలిసిందే. తమిళనాట స్టాలిన్, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ గెలుపు కోసం పీకే టీమ్ ఆ రెండు రాష్ట్రాల్లో మకాం పెట్టి బ్యాలెట్ పరీక్షలో విజయం సాధించింది.
2019 ఎన్నికల్లో ఏపీలో వైకాపా గెలుపు వెనుక ప్రశాంత్ కిశోర్ ప్రణాళికలే ప్రధాన కారణం అని రాజకీయ వర్గాల్లో ఉన్న టాక్. పీకేతో అప్పటి నుంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఏపీ సీఎం జగన్ మరోసారి రాబోయే ఎన్నికల్లో తన కోసం పనిచేయాలని ఆహ్వానించినట్టు తెలిసింది. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో మోదీ వ్యతిరేక కూటమి కూర్పు కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్న ప్రశాంత్ కిశోర్.. జగన్ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించినట్లు తెలుస్తోంది. సీఎం జగనే స్వయంగా మంత్రివర్గ సహచరులతో ప్రశాంత్ కిషోర్ మనకోసం వచ్చే ఎన్నికల్లో పనిచేయబోతున్నారని చెప్పారు. పీకే బృందం ఏపీలో గత ఎన్నికల్లో "రావాలి జగన్.. కావాలి జగన్", "అన్నొస్తున్నాడు" వంటి ఆకర్షణీయ నినాదాలతో ప్రజల్లోకి వెళ్లింది.
చంద్రబాబు ప్రభుత్వంపై వివిధ సామాజిక వర్గాల్లో వ్యతిరేకత తీసుకురావటానికి ప్రశాంత్ కిషోర్ బృందమే ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆగ్రహంతో ఉంది. ఇతర రాష్ట్రాల్లో మంచి సక్సెస్ రేటు ఉన్న ప్రశాంత్ కిశోర్ వచ్చేసారి ఏపీ ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తారనేది తెలియటానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది.
ఇదీచూడండి: 'బయటి వ్యక్తికి కీలక బాధ్యతలా'? ఇక అంతా వారి చేతుల్లోనే..!