ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆక్సిజన్ ట్యాంకర్‌ను సకాలంలో కొవిడ్ పేషెంట్లకు అందించి ప్రాణాలను కాపాడారు. గురువారం రాత్రి 8గంటలకు 18టన్నులతో ఒడిశా నుంచి బయలుదేరిన ఆక్సిజన్ ట్యాంకర్ తెల్లవారుజామున హఠాత్తుగా సిగ్నల్స్ తెగిపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు రంగంలోకి దిగారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయవాడ వరకు మధ్యలో ఉన్న అధికారులతో మాట్లాడి వాహనం సిగ్నల్ ఎలా తెగిపోయిందో కనుక్కున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం వద్ద ఓ డాబాలో ఆక్సిజన్ ట్యాంకర్ని ప్రత్తిపాడు పోలీసులు గుర్తించారు. నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరాలో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపివేసినట్టుగా పోలీసులకు డ్రైవర్ తెలిపారు. డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రత్తిపాడు సీఐ.. అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. డ్రైవర్‌కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్‌ను సురక్షితంగా విజయవాడ జీజీహెచ్‌కు పోలీసులు చేర్చారు. పోలీసుల చేపట్టిన చర్యతో సుమారు 400 మంది రోగుల ప్రాణాలు నిలిచాయి.
పోలీసులకు డీజీపీ అభినందనలు
సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్‌ను తీసుకొచ్చి… విజయవాడ జీజీహెచ్‌లో 400 మంది ప్రాణాలు కాపాడిన పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి చేరిన 3.35లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు