గోదావరి నదిపై చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు శనివారం తలపెట్టిన ‘జల దీక్ష’ను పోలీసులు భగ్నం చేశారు. ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుని.. గృహనిర్బంధం చేశారు. తమ కళ్లుగప్పి బయటికి వచ్చినవారిని అరెస్టు చేశారు. కొన్నిచోట్ల పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్కను ఖమ్మం జిల్లా వైరాలో గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే సీతక్కను ములుగులో, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మంథనిలో పోలీసులు అడ్డుకున్నారు. శ్రీధర్‌బాబు సాయంత్రం వరకు ఇంట్లోనే నిరసన దీక్షకు కూర్చున్నారు.
ధర్నాలు.. వాగ్వాదాలు
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ను సిరిసిల్లలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు గోడ దూకి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పొన్నం ప్రభాకర్ సైతం ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ తదితరులను రాజన్న పార్టీ కార్యాలయంలో నిర్బంధంలో ఉంచారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరగా.. అర్ధరాత్రి కొత్తగూడెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం చేసిన వీహెచ్.. రోడ్డుపై పడుకొని ధర్నాకు దిగారు. వారిని అరెస్టు చేసి లక్ష్మీదేవిపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య ఆందోళనకు దిగారు. జగిత్యాల నుంచి తుమ్మిడిహెట్టికి బయలుదేరిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కారును అడ్డుకోవడంతో కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై నిరసనకు దిగారు. ఆయనను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
గౌరవెల్లి- గండిపల్లి వద్దకు సంపత్‌కుమార్
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పోలీసుల కళ్లుగప్పి శనివారం ఉదయం కార్యకర్తలతో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి- గండిపల్లి ప్రాజెక్టుపైకి చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. సంపత్‌కుమార్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
జల దోపిడీ బహిర్గతమవుతుందనే: భట్టి
జల సందర్శనతో ప్రాజెక్టుల దోపిడీ, అవినీతి బహిర్గతమవుతుందన్న భయం కేసీఆర్‌కు పట్టుకుందని సీఎల్పీ నేత భట్టి విమర్శించారు. వైరాలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల డిజైన్లు, పేర్లు మార్చి కాళేశ్వరం, సీతారామ పేర్లతో వ్యయ అంచనాలు పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎగువ మానేరు ప్రాజెక్టు నిర్మాణాన్ని అక్టోబరులోగా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని...లేకుంటే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, మంత్రులు కొవిడ్-19 ఆంక్షలను ఉల్లంఘించి కార్యక్రమాలు చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తే తప్పేముందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
గవర్నర్, కేంద్రం దృష్టికి
కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కలిసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై గవర్నర్, కేంద్ర పెద్దలను కలుస్తామని, వారి వ్యవహార శైలిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. పార్టీ నేతలు జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవితో కలిసి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉత్తమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2004- 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో 33 ప్రాజెక్టులు మొదలుపెట్టగా.. వాటిని తెరాస ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టి, రీడిజైనింగ్ పేరుతో ఎక్కువ కమీషన్లు వచ్చేవాటినే చేపడుతోందని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి¨ వద్ద ఇప్పటివరకు తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. నెలరోజుల క్రితం సీఎం ప్రారంభించిన కొండపోచమ్మ రిజర్వాయర్ కాలువకు గండి పడిందని.. ఈ ప్రాజెక్టు పనుల నాణ్యత అర్థమవుతోందన్నారు. ప్రాజెక్టులను సందర్శిస్తున్నామని డీజీపీకి లేఖ రాస్తే సమాధానం లేదని, ఫోన్ చేస్తే ఎత్తడం లేదన్నారు.