సంక్రాంతి పండుగ తర్వాత వెంటనే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్... విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఆన్లైన్ పాఠాలు 30 శాతం మంది విద్యార్థులకు అందడంలేదని అసోసియేషన్ అధ్యక్షుడు నాగటి నారాయణ మంత్రికి వివరించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతోపాటు వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోవడం.. వంటి మంచి పరిణామాల నేపథ్యంలో పాఠశాలలు పనిచేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
వేసవి శెలవులు లేకుండా మే నెలలో తరగతులు నిర్వహించి.. జూన్లో పరీక్షలు జరపాలన్నారు. నవంబర్లో ఆంధ్రప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయని.. ఈ నెలలో కేరళ, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో ప్రారంభించారన్నారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలియచేశారు.
టీపీఏ సూచనలను పరిగణలోకి తీసుకొని విద్యాసంస్థల ప్రారంభం, విద్యా సంవత్సరం తదితర విషయాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో టీపీఏ రాష్ట్ర సహాధ్యక్షులు పి.ఇంద్రజిత్, కార్యదర్శి ఎండీ ఇబ్రహీం, అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం