నిత్యావసరాల ధరలు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో సాధారణ హోటళ్లలోనే జేబుకు చిల్లు తప్పడం లేదు..! అదే కాస్త పెద్ద హోటళ్లలో అయితే.. ధరలు పెరుగుతూపోవడమే తప్ప తగ్గేది లేదు. కానీ తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కాకా హోటల్(ONE RUPEE IDLY)లో మాత్రం పేదలకు అందుబాటు ధరలో కడుపు నింపుతోంది.
ఎవరైనా సరే అటువైపు వెళ్తున్న వారు ఈ హోటల్ దగ్గర ఠక్కున ఆగిపోతారు. పెద్దాపురం మండలం ఆర్.బీ కొత్తూరులో చిన్ని రామకృష్ణ, చిన్నిరత్నం లక్ష్మి దంపతులు హోటల్ నడుపుతున్నారు. 16 ఏళ్లుగా ప్లేటు ఇడ్లీ, బజ్జీ రూపాయి చొప్పున అందిస్తున్నారు. ఈ దంపతులతో పాటు రత్నం లక్ష్మి తల్లి, అత్తయ్య ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు హోటల్ నిర్వహిస్తారు.
నిత్యావసర ధరలు మండుతున్నా... రూపాయికి ఇంకో రూపాయి పెంచలేదు. డబ్బు సంపాదనే కాదు... సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్నామని వారు చెబుతున్నారు. తెల్లారిందంటే చాలు హోటల్‌కు జనం క్యూ కడతారని అంటున్నారు.
ఫస్ట్ నుంచి రూపాయికి అమ్మేవాళ్లం. మొదట్లో అర్ధరూపాయికి అమ్మినం. అందరిలాగా రొటీన్‌గా కాకుండా భిన్నంగా చేయడానికి రూపాయి ఇడ్లీ ప్రారంభించాం. రూ.5పట్టుకుని సిగ్గుపడకుండా ఇడ్లీ ఇవ్వమని అడగవచ్చు. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చాన్నాళ్లు టిఫిన్‌కి ఇబ్బంది పడ్డాం. ఎన్నో కష్టాలు అనుభవించినందున మాకు ఒక ఆలోచన వచ్చింది. మేమైతే పొట్టకోసమే హోటల్ పెట్టుకున్నాం. తర్వాత లేనివాళ్లు, ఫ్యాక్టరీ వాళ్లు, కూలీలు ఎక్కువగా టిఫిన్ కొనుక్కొని కడుపున నిండా తినేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో తక్కువ డబ్బులతోనే నీట్‌గా మంచి టిఫిన్ అందించాలని ఇస్తున్నాం.
-చిన్ని రామకృష్ణ దంపతులు
అన్ని ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో రూపాయికే ఇడ్లీ, బజ్జీలు ఇవ్వడమంటే ఎంతో గొప్ప విషయమని అక్కడ టిఫిన్ చేసినవాళ్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Bathukamma day 3, 2021: మూడో రోజు 'ముద్దపప్పు బతుకమ్మ' విశేషాలు..