రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ వెలుగు చూడలేదని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2.2 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు కాగా... ఇప్పటివరకు రాష్ట్రంలో 97 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. ఇందులో 83 లక్షలమంది మెుదటి డోసు వారు ఉన్నట్లు స్పష్టం చేశారు. జులైలో 32 లక్షల మందికి పైగా రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాగా... మెుత్తం 2.2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని డీహెచ్ తెలిపారు.
జీహెచ్ఎంసీలో 100 కేంద్రాల ద్వారా రోజూ 15 వందల మందికి టీకాలు ఇస్తున్నామన్నారు. 24 మెుబైల్ వ్యాన్ల ద్వారా వ్యాక్సిన్ వేస్తున్నామన్న డీహెచ్... నిన్నటి నుంచి 30 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో వ్యాక్సినేషన్ కోటి మార్క్ దాటుతుందని తెలిపారు.
ఇక పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రారంభించినట్టు తెలిపారు. టీచర్లు తమ గుర్తింపు కార్డులు చూపించి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మాత్రం ఇప్పటివరకు నమోదు కాలేదు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. థర్డ్‌వేవ్ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు మార్గనిర్దేశకాలు జారీ చేశాం. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ... తరగతులు నిర్వహించాలని ఇప్పటికే సూచించాం.- శ్రీనివాసరావు, డీహెచ్