NTR STATUE IN DURGI: తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా దుర్గిలో చోటు చేసుకుంది. దుర్గి మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు.. గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగల గొట్టేందుకు ప్రయత్నించాడు.
అందరూ చూస్తుండగా.. పట్టపగలే ఈ దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో విగ్రహం స్వల్పంగా దెబ్బతింది. విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై పాల్.. కేసు నమోదు చేశారు.
లోకేశ్ ఆగ్రహం..
ఈ ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మహనీయుల విగ్రహాల ధ్వంసానికి ప్రయత్నించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇందుకు యత్నించిన వైకాపా నేత కోటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరో ఘటనలో..
గుంటూరు జిల్లా తాడికొండలో ఎన్టీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విగ్రహం వద్ద తెదేపా నేతలు ధర్నా చేపట్టారు.
ఇదీచదవండి :