2017లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులు పలుసార్లు కేంద్రజల్‌శక్తి మంత్రి, అధికారులతో సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వీటిని సి.ఎ.డి.డబ్ల్యూ.ఎం కింద అభివృద్ధి చేయాలి. వీటికయ్యే ఖర్చును కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. ఈ పనుల పురోగతిని తరచూ కేంద్రజలసంఘం అధికారులు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాజెక్టుల అంచనా వ్యయం తొలుత రూ.1,929 కోట్లు. పలు మార్పులు చేర్పుల తర్వాత అది రూ.1,661.10 కోట్లకు తగ్గింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి విడుదలైంది కేవలం రూ.36.34 కోట్లు మాత్రమే. దీనికి కారణం ఇప్పటివరకు ఏయే పనులు చేపట్టాలో నిర్ణయించి పరిపాలనా అనుమతి కూడా ఇవ్వకపోవడమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రాజెక్టుల కింద ఆయకట్టు నీటి ప్రవాహ మార్గాలు ఖరారు కాకపోవడం, రైతులకు భాగస్వామ్యం కల్పించకపోవడం, నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు ఇలా ఏ ఒక్క విషయంలోనూ అడుగు ముందుకు పడలేదు. అత్యంత వేగంగా మూడేళ్లలో ఆయా పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, నాలుగేళ్లయినా కొన్ని ప్రారంభమే కాలేదు. 11 ప్రాజెక్టుల కింద 1,148 నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, 2020-21లో 32 ఏర్పాటు చేసినట్లు నీటిపారుదల శాఖ కేంద్ర జలసంఘానికి నివేదించింది. అత్యధికంగా దేవాదుల ఎత్తిపోతల కింద 498, ఎస్సారెస్పీ-2 కింద 356, భీమా కింద 164, వరదకాలువ కింద 58 ఏర్పాటు చేయాల్సి ఉంది
ప్రాజెక్టుల్లో ప్రధాన పనులే లక్ష్యం మేరకు పూర్తికాకపోవడం, డిస్ట్రిబ్యూటరీ పనుల్లో జాప్యం కారణంగా ఆయకట్టు అభివృద్ధి పనులు చేపట్టలేకపోయినట్లు తెలుస్తోంది. 2020-21లో రూ.299.53 కోట్ల పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా అదీ జరగలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో 2021-22లో రూ.373.614 కోట్ల పనులు చేపట్టి పూర్తి చేయాలని నిర్ణయించారు. గత నాలుగేళ్లుగా జరిగిన తీరును చూస్తే ఈ ఏడాది కూడా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందన్న నమ్మకం లేదని కేంద్ర జల్‌శక్తి వర్గాలు అభిప్రాయపడ్డాయి.
![](https://assets.eenadu.net/article_img/ghmain-2b_78.jpg)