దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న బర్డ్‌ఫ్లూ నుంచి జంతువులను, పక్షులను పరిరక్షించడానికి హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... అధికారులు వెటర్నరీ వైద్యులను అప్రమత్తం చేశారు. ఎన్‌క్లోజర్ల వద్ద రోజూ ఉదయం, సాయంత్రం బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు.
పక్షులకు అందించే ఆహరం జూపార్క్‌లోకి తీసుకొచ్చిన వెంటనే రసాయనాలతో శుద్ధి చేసి అందిస్తున్నారు. పక్షుల సంరక్షణకు బయోలాజికల్ సిబ్బంది సలహాలు, సూచనలతో ఓ నివేదికను రుపొందిస్తున్నట్లు... జూపార్క్ అసిస్టెంట్ క్యూరియేటర్ నాగమణి తెలిపారు. ఈనెల 11న స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి నిబంధనలు రూపొందిస్తామన్నారు.
తుది పరీక్షల కోసం
రాష్ట్రంలో కోళ్ల నుంచి సేకరించిన 276 నమూనాలను పశు వైద్య జీవ ప్రయోగశాలలో పరీక్షించినా వ్యాధి లక్షణాలేమీ కనిపించలేదు. మరో 534 నమూనాలను బెంగళూరులోని దక్షిణ భారత ప్రాంతీయ ప్రయోగశాలకు పంపారు. ఈ వ్యాధి సోకినట్లు అనుమానమొస్తే నమూనాలను తుది పరీక్షల కోసం భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది
ఈ నంబరుకు సమాచారం ఇవ్వండి
జూపార్కులు, అటవీ ప్రాంతాల్లో పక్షుల అసహజ మరణాలు కనిపిస్తే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని పీసీసీఎఫ్ ఆర్.శోభ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. పక్షులు మరణిస్తే ప్రజలు టోల్‌ఫ్రీ నంబరు 1800 425 5364కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
దేశంలో టీకా లేదు
బర్డ్‌ఫ్లూ నివారణకు వేసే టీకాలు మనదేశంలో లభించడం లేదు. ఇప్పటివరకూ తెలంగాణలో ఎక్కడా ఈ వ్యాధి లక్షణాలు కనపడలేదు. కానీ ఎందుకైనా మంచిది అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల పశు వైద్యాధికారులకు ఆదేశించాం. కోడి మాంసంపై ఎలాంటి దుష్ప్రచారం చేయవద్దు.
ఇవీ చూడండి: బర్డ్ ఫ్లూ కలకలం! ఒడిశాలో 700 కోళ్లు మృతి