హైకోర్టు న్యాయవాదుల హత్యపై టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. న్యాయం కోసం పోరాడే వారిని చంపడం అత్యంత హేయమైన చర్యగా వర్ణించారు. తెరాస ప్రభుత్వం వచ్చింది.. రాష్ట్రాన్ని దోచుకునేందుకేనన్న ఉత్తమ్.. సాండ్, ల్యాండ్, మైన్, వైన్ దోపిడీతో పాటు హత్యలకూ తెగబడుతున్నారని విమర్శించారు. వామన్రావు దంపతుల హత్య తెరాస చేసిందేనని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఈ హత్యలను ఖండించలేదని ఉత్తమ్ మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు గులాబీ చొక్కా వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వామన్రావు దంపతులు.. తమకు ప్రాణహాని ఉందని చెప్పినా.. ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పూర్తి డమ్మీగా మారారని అన్నారు. సీపీ సత్యనారాయణ తెరాస తొత్తులా పనిచేస్తున్నారని ఆరోపించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సీజేను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాస్తామని చెప్పారు. న్యాయవాదుల హత్యను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : న్యాయవాదుల ఆందోళన.. విధుల బహిష్కరణ