ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను హైదరాబాద్ సిట్ పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. 1998 జులైలో సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో బాంబు పేలుడుకు కుట్ర పన్నిన కేసులో వాయిదా నిమిత్తం ఘజియాబాద్ జైలు నుంచి తీసుకువచ్చి.. నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ నెల 15వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని సిట్ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. దేశవ్యాప్తంగా 40 వరకు బాంబుపేలుడు కేసుల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు. వీటిల్లో కొన్ని కేసులు వీగిపోగా కొన్ని కేసులు విచారణలో ఉన్నాయి.
లష్కరే తోయిబాతో కీలక సంబంధాలు
టుండాకు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో కీలక సంబంధాలున్నాయి. స్థానికంగా దొరికే వస్తువులు, రసాయనాలతో బాంబుల్ని తయారు చేసే విషయంలో యువతకు మెళకువలు చెబుతాడని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. 1992 డిసెంబరులో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశంలో యువతను ఉగ్రవాద భావజాలం వైపు నడిపించడంతోపాటు పేలుళ్లు జరపడంపై ఇతడు దృష్టి సారించాడు. 26/11 ముంబయి దాడుల తర్వాత 20 మంది కీలక ఉగ్రవాదుల్ని తమకు అప్పగించాలని భారత్.. పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. అందులో టుండా ఒకడు కావడం గమనార్హం.
ఇవీ చూడండి: దోమకొండలో ముగ్గురి దారుణ హత్య