వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సంబంధించిన ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేటలో తోట త్రిమూర్తులు ఫొటోతో ఫ్లెక్సీలు పెట్టారు. నెలలు గడుస్తున్నా వాటిని తొలగించలేదు. వర్షాకాలం నేపథ్యంలో కొన్ని ఫ్లెక్సీలతో ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. వాటిని తొలగించాలని స్థానిక నాయకుడు నల్లమిల్లి వీర్రెడ్డి.. పురపాలక సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తన మిత్రుడైన 7వ వార్డు కౌన్సిలర్ సవరపు సతీశ్‌కు త్రిమూర్తులు ఫోన్ చేసి బెదిరించారని వీర్రెడ్డి తెలిపారు. తనకు ఏదైనా జరిగితే తోట త్రిమూర్తులుదే బాధ్యత అని అన్నారు.
ఆడియో కాల్లో ఏముందంటే...!
'వీర్రెడ్డికి చెప్పు. నేను అందరిలా కాదు. కాళ్లు, చేతులూ తీయించేస్తానని చెప్పు. ఫ్లెక్సీలు తీయించేయాలంటూ పిటిషన్లు ఇవ్వడమేంటి..? వాడికి పోయే కాలమేంటి..? సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు పెడుతున్నాడు.. ఏంటీ సంగతి..! పిలిపించి చెబుతాను వాడి సంగతి'
రాజకీయ ఉద్దేశం లేదు: వీర్రెడ్డి
రెండో తేదీన మండపేటలో భారీ వర్షం కురిసిందని.. ఫలితంగా చాలా చోట్ల ఫ్లెక్సీలు తెగి విద్యుత్‌కు అంతరాయం కలిగిందని వైకాపా నేత నల్లమిల్లి వీర్రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది ఉండొద్దనే ఫ్లెక్సీలపై పురపాలక సంఘం అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. కానీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వేరేలా అర్థం చేసుకుని.. తన మిత్రుడు సతీశ్‌కు ఫోన్ చేసి బెదిరించారని పేర్కొన్నారు. సోమవారమే ఆ ఆడియో తన దృష్టికి వచ్చిందని వీర్రెడ్డి చెప్పారు. భయాందోళనతో పోలీసులను ఆశ్రయించానని.. తనకేమైనా జరిగితే తోట త్రిమూర్తులదే బాధ్యత అని వీర్రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: 'నేను రాజకీయాల్లోకి ఎప్పటికీ రాను... నా కల వేరే ఉంది'