Mission Bhagirath award in telangana: మిషన్ భగీరథకు అవార్డు విషయంలో.. బాధ్యతాయుతమైన కేంద్ర జలశక్తిశాఖ ప్రకటన విడ్డూరంగా ఉందని మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆక్షేపించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఇచ్చిన ప్రకటనపై స్పందించిన మంత్రి, కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. గ్రామీణ గృహాలకు నీటిసరఫరా రెగ్యులేటరీ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరచిన తెలంగాణకు అక్టోబర్ రెండో తేదీన అవార్డు బహుకరిస్తున్నట్లు సెప్టెంబర్ 26న జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ వికాస్ షీల్ లేఖ రాశారన్నారు.
ఇదే విషయాన్ని తాను, మంత్రి హరీష్ రావు మీడియాకి చెప్పినట్లు తెలిపారు. అందులో తప్పేముందని ఎర్రబెల్లి అన్నారు. గ్రామీణ గృహాలకు మిషన్ భగీరథ ద్వారానే నీటి సరఫరా చేస్తున్నామన్నారు. గ్రామీణ గృహాల నీటిసరఫరాకు అవార్డు ఇస్తే మిషన్ భగీరథకు ఇచ్చినట్లు కాదా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకాన్ని సమీక్షించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అభ్యంతరాలు లేవనెత్తిన లేఖలో కూడా ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు అబద్ధాలు అనడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అబద్ధమా? లేక జల్ జీవన్ మిషన్ అబద్ధమా? అని దయాకర్ రావు ప్రశ్నించారు. నీటిని సరఫరా చేస్తున్నట్లు గ్రామపంచాయతీలు తీర్మానించలేదనే కొత్త మెలిక పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మంత్రిత్వ శాఖ ఇలా ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వాస్తవాలు గ్రహిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: