చిన్న పామైనా పెద్ద కర్రతో కట్టాలన్నది పెద్దలు చెప్పిన సామెత. చిన్న నొప్పైనా... స్కానింగ్, బ్లడ్ టెస్ట్ , ఎక్స్‌రే ఇలా రకరకాల పరీక్షలు చేసి నిర్ధరించుకుంటే మంచిదన్నది నేటి వాదన. పంటి నొప్పి మొదలు గుండెపోటు వరకు వ్యాధి ఏదైనా... వైద్యం కంటే పరీక్షలకే లక్షలు ఖర్చవుతున్నాయి. ఫలితంగా పేదలకు వైద్య ఖర్చులు మోయలేని భారమవుతున్నాయి. ఈ విషయంపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించిన తెలంగాణ సర్కారు... 2018లో నారాయణ గూడలోని ఐపీఎం ప్రాంగణంలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంట్రల్ హబ్‌ని ఏర్పాటు చేసింది. ఇందులో నిత్యం 57 రకాల రక్త , మూత్ర పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 319 ఆస్పత్రుల నుంచి ఈ కేంద్రానికి నిత్యం శాంపిళ్లు వస్తుంటాయి. గత మూడేళ్లలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంట్రల్ హబ్ ద్వారా సుమారు పది లక్షల మందికి ప్రయోజనం చేకూరిందంటే వైద్య పరీక్షల ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో డయాగ్నస్టిక్ సేవలను మరింత విస్తరించాలని భావించిన సర్కారు నేటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో మరో 8 మినీ హబ్‌లను ప్రారంభించింది. ఆయా కేంద్రాల్లో రక్త, మూత్ర పరీక్షలతోపాటు.... రేడియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
నేటి నుంచి శ్రీరాంనగర్, లాలాపేట, అంబర్ పేట, బార్కాస్, జంగంపేట, పనీపురా, పురానాపూల్, సీతాఫల్ మండీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్... లాలాపేట కేంద్రాన్ని, శ్రీరాం నగర్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్.... పురాణాపూల్ప, నీపురా, బార్కాస్ కేంద్రాలను మంత్రి మహమూద్ అలీ, అంబర్‌పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీతాఫల్ మండిలో శాసనసభ ఉపసభాపతి పద్మారావు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మినీ హబ్‌లను ప్రారంభించారు.
ఆయా కేంద్రాల్లో ఈసీజీ, ఎక్స్‌రే, ఆల్ట్రా సౌండ్ స్కాన్ కోసం అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకురావటం విశేషం. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పొందుతున్న వారికి అవసరమైన రేడియాలజీ సేవల కోసం వైద్యులు ఆయా కేంద్రాలకు రోగులను పంపనున్నారు. అయితే గతంలో మాదిరి గంటల తరబడి ఫలితాల కోసం ఎదురుచూసే అవసరం లేకుండా టెలీ రేడియాలజీ విధానంలో నేరుగా రోగులకు సంబంధించిన రేడియాలజిస్టులకు ల్యాబ్ నుంచి ఫలితాలను పంపనున్నారు. ఈసీజీ సహా అన్ని పరీక్షల ఫలితాలను ఆన్ లైన్ ద్వారా అందించటం ఈ హబ్‌ల ప్రత్యేకత. ముఖ్యంగా పేదింటి గర్భిణీ స్త్రీలకు ఈ మినీ హబ్‌లు వరంగా మారనున్నాయి. ఆయా కేంద్రాల్లో ఆల్ట్రా సౌండ్ చేయించుకోవటం ద్వారా వైద్య ఖర్చులు తగ్గటంతోపాటు... తప్పనిసరి పరిస్థితిల్లో వేగంగా వైద్యం అందించేందుకు ఈ కేంద్రాలు మరింత ఉపయోగపడనున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ మినీ హబ్‌లకు వచ్చే స్పందనను పరిశీలించిన అనంతరం... జిల్లాలకు సైతం ఆయా సేవలు విస్తరించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. పేదలు పరీక్షల కోసం వేలకు వేలు నష్టపోవద్దని కోరిన ఆయన... భవిష్యత్తులో వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేసేందుకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు.