Niranjan Reddy Comments: కేంద్రం విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా.. దేశంలోని అన్నదాతలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతుల పక్షాన ఆరు రోజులుగా దిల్లీలోనే ఉంటూ.. ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్రం స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కానీ.. భాజపా నేతలు మాత్రం ఎలాంటి బాధ్యత లేకుండా.. అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రం రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోంది..
Niranjan Reddy on Paddy Procurement: వినూత్న విధానాలు, సహసోపేత నిర్ణయాలు తీసుకుంటేనే ప్రభుత్వాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి తెలిపారు. అలాంటి నిర్ణయాలు, విధానాలు సీఎం కేసీఆర్ చాలా తీసుకున్నారని తెలిపారు. ఎన్నో సందర్భాల్లో కేంద్రమే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిందని గుర్తుచేశారు. అలాంటి కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు రాజకీయ పార్టీగా వ్యవహరించటం బాధాకరమన్నారు. రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామన్న కేంద్ర మంత్రి.. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. యాసంగి ధాన్యం తీసుకోమన్నందుకు ఒప్పుకుని.. రైతులకు కూడా వరి వేయొద్దని చెప్పామన్నారు. కానీ.. వానాకాలంలో పండిన ధాన్యం విషయంపై.. నోటితో చెప్పిన మాటను రాతపూర్వకంగా అడుగుతున్నామని స్పష్టం చేశారు. అది చెప్పకుండా.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ అవమానిస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రెండు మాట్లాడుకుంటూంటే.. మధ్యలో ఎలాంటి సంబంధంలేని కొందరు వ్యక్తులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రేమలేఖలు రాసేందుకు వచ్చామా..?
"కేంద్రంలోని అనేక శాఖలు తెలంగాణ పురోగతిని ప్రశంసించాయి. కానీ వాళ్ల విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చింది. కేంద్రప్రభుత్వం రాజ్యాంగపరమైనదే అనే విషయాన్ని భాజపా నేతలు మర్చిపోతున్నారు. కేంద్రంలోని భాజపా కార్పొరేట్ల కోసం ఏమైనా చేస్తోంది. దగ్గరుండి మరీ కార్పొరేట్ కంపెనీలకు ఒప్పందాలు కుదుర్చి ఇస్తున్నారు. రైతులను మాత్రం విస్మరిస్తోంది. ధాన్యంపై రెండ్రోజుల్లో నిర్ణయం చెప్తామని ఇంతవరకు చెప్పలేదు. రైతుల సమస్య పరిష్కారం కోసం దిల్లీలో పడిగాపులుకాస్తున్నాం. ప్రేమలేఖలు రాసేందుకు వచ్చినట్లు కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు. దాదాపు 20 ఉత్పత్తులకే కేంద్రం నామమాత్రపు ఎంఎస్‌పీ ఇస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మోదీ అన్నారు. రైతులు, కొత్తతరం వారు వ్యవసాయాన్ని విడిచిపెట్టేలా మోదీ చేస్తున్నారు. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసం సాగు చట్టాలు రద్దు చేశారు. బ్యాంకు రుణాలు ఎగవేస్తున్న పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహిస్తే రాష్ట్రంలో యాసంగిలోనూ 70 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. గుజరాత్‌లో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా..? కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా..? రాష్ట్ర రైతుల కోసం ప్రధానితో కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడరు..? రాష్ట్రం నుంచి బియ్యం తరలించడంలో కేంద్రానిదే లోపముంది. వ్యాగన్ల కొరత వల్ల తరలించలేకపోతున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు." - నిరంజన్‌రెడ్డి, మంత్రి
ఇవీ చూడండి: