KTR On Congress: భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ సస్పెన్షన్‌పై కేటీఆర్ స్పందించారు. వారిని సస్పెండ్ చేయడంపై భాజపా అధ్యక్షుడు కంటే కాంగ్రెస్ అధ్యక్షుడే ఎక్కువ బాధపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. భాజపా, కాంగ్రెస్ అవిభక్త కవలలుగా అభివర్ణించారు. దీంతో సభలో ఒక్కసారిగా దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడితే అండగా ఉంటామని.. కానీ సభలో లేని వ్యక్తి కోసం మాట్లాడడం సరికాదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. భట్టి చాలా మంచివారని.. కానీ వారి అధ్యక్షుడే అక్రమార్కులంటూ ఆరోపణలు చేశారు. దీనిపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి.. కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్‌ను కోరారు.
ఇంతలో జోక్యం చేసుకున్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పుట్టినరోజున సంతాప దినాలుగా చేసుకోవాలని సూచించడంపై మండిపడ్డారు. అలాంటి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి ఉండడం వారి దురదృష్టమంటూ వ్యాఖ్యానించారు. దీనిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భట్టి విక్రమార్క.. ఎక్కడో బయట మాట్లాడిన మాటలను సభలో ప్రస్తావించడం సబబుకాదన్నారు. ఇది సంస్కారం కాదన్నారు.
ఈ సందర్భంగా మరోసారి జోక్యం చేసుకున్న కేటీఆర్.. రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీకి తొలుత అండగా నిలిచింది.. సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. తాము ఎవరి దగ్గరా సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇదీచూడండి: KTR In Assembly: 'నాడు అచ్చేదిన్ అన్నారు... అది కాస్త చచ్చేదిన్ అయింది'