Kodali Nani Comments on Chandrababu : ఏపీలో ఏ ఘటన జరిగినా.. శవాలపై చిల్లర ఏరుకునేలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బాధితులకు బియ్యం, నిత్యావసరాలు, ఇళ్లు దెబ్బతింటే ఇళ్లు, విద్యుత్ ఇలా అన్ని అంశాల్లో చర్యలు తీసుకుంటున్నారన్నారు. తన భార్యను ఎదో అన్నారని సాకులు చెబుతూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారని.. చంద్రబాబు సతీమణి పేరును అసెంబ్లీలో కానీ బయట కానీ వైకాపా నేతలు ఎక్కడా చెప్పలేదని నాని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు ఆమె పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలు విడిచి పెట్టి తన సొంత విషయాలు బాధితులకు ఏకరువు పెట్టడం ఏమిటని నాని ప్రశ్నించారు.
వారంతా అమాయకులు
Kodali Nani about Nandamuri Family : నందమూరి కుటుంబం అంటే అందరికీ గౌరవమేనన్న నాని.. సీఎం కూడా వారిని గౌరవిస్తారని చెప్పారు. అయితే వారంతా అమాయకులని.. చంద్రబాబు లాంటి వ్యక్తిని నమ్మి వారి కుటుంబ సభ్యులు మోసపోయారన్నారు. సీఎం వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయా అని నిలదీశారు. ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి జగన్ అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారని కొడాలి నాని తెలిపారు. రెండు టీఎంసీలు పట్టే బ్యారేజీలోకి 6 గంటల్లో 32 టీఎంసీల నీరు వచ్చిందని, 6 గంటల్లో బయటకు ఎలా పంపించగలం అందులో మానవ తప్పిదం ఏముందని ప్రశ్నించారు. అంత భారీ వర్షం వచ్చింది కాబట్టే ఇంత ఉత్పాతం వచ్చిందని.. భారీ వర్షం వస్తుందని ఎవరు ఉహించగలరని నాని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కంట్రోల్ చేస్తారు..
Kodali Nani on Junior NTR : ‘మాకు జూనియర్ ఎన్టీఆర్‌కి ఏంటి సంబంధం. నన్ను, వంశీని ఆయన ఎందుకు నియంత్రిస్తారు. మేమేమన్నా ఆయన పార్టీనా? ఆయన సినిమాకు నిర్మాతలమా? లేదా డైరెక్టర్లమా? లేకపోతే ఆయన దగ్గరేమన్నా నటన నేర్చుకున్నామా? ఒకప్పుడు కలిసి ఉన్నాం. విభేదాలు వచ్చి బయటకు వచ్చాం. ఇప్పుడు వైకాపాలో ఉన్నాం. జగన్ మా నాయకుడు. ఆయన చెప్పినా... చెప్పకపోయినా ఆయన కోసం ఏదైనా చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేమెందుకు వింటాం?’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.