పన్నుల వాటా తగ్గుతున్నందుకు తెలంగాణకు కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.723 కోట్లు వన్ టైం గ్రాంటుగా ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీశ్ దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాను 15వ ఆర్థికసంఘం 2.43 నుంచి 2.13 కు తగ్గించిందన్నారు. 15వ ఆర్థికసంఘం సిఫార్సు ప్రకారమే కేంద్రం ఇవాళ ప్రకటించిన ప్యాకేజీ ఉందని... తద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ్టి ప్యాకేజీ అమలుతో ఆయా రాష్ట్రాల జనాభా, పెట్టుబడి వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలని, తద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరుతుందని సూచించారు. ఆదాయంలో కొరత ఏర్పడితే సెక్షన్ 7(2) ప్రకారం జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు ప్రతి రెండు నెలలకోసారి చెల్లించాలని, దాన్ని తప్పనిసరిగా పరిహార నిధి నుంచే ఇవ్వాలని సమావేశంలో హరీశ్ రావు చెప్పారు. సెస్తోపాటు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసే ఇతర మొత్తాన్ని తప్పనిసరిగా జీఎస్టీ పరిహార నిధిలోనే జమ చేయాలన్నారు.
కేంద్రం ఇచ్చిన రెండు ఐచ్ఛికాల కింద పేర్కొన్న రుణాలు ఇతర నిధుల కింద ఉన్నట్లు చట్టంలో ఉందని... ఆ విషయమై జీఎస్టీ కౌన్సిల్లో చర్చించవచ్చని అభిప్రాయపడ్డారు. మొదటి ఐచ్ఛికంలో పేర్కొన్న పరిహారంతోపాటు అంతరంగా ఉన్న రూ.73వేల కోట్లు రాష్ట్రాలకు చెల్లించాలని కోరారు. జీఎస్టీ పరిహారం చెల్లింపుల కోసం తీసుకునే రుణం 293 ఆర్టికల్ పరిధిలో ఉండదన్న ఆయన... ఈ విషయంలో ఛత్తీస్గఢ్ మంత్రి ప్రతిపాదనను సమర్థిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: మొక్కజొన్న సాగు వద్దని రైతులకు అవగాహన కల్పించండి: హరీశ్