Pending Bifurcation Issues: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న కీలక సమావేశం నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష నిర్వహించనున్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలు, ఇబ్బందులు, పరిష్కారం కోసం... తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. కేంద్ర హోంశాఖ సమావేశంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎస్ సోమేశ్ కుమార్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఏపీవి అన్ని గొంతెమ్మ కోరికలు..
విభజన అంశాలు, సమస్యలు, వాటి ప్రస్తుత స్థితిని అధికారులు సీఎంకు వివరించారు. అవసరం లేని వివాదాలు సృష్టిస్తూ... విభజన చట్టంలో లేని అంశాలను ఆంధ్రప్రదేశ్ కావాలని ముందుకు తెస్తోందని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా సింగరేణి లాంటి సంస్థల్లో వాటా కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతోందన్నారు. ఆ కారణంగానే ఇప్పటికే పరిష్కారం కావాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు.
కట్టుబడి ఉంటేనే సరకరించేది..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి రాష్ట్రం నూటికి నూరు శాతం కట్టుబడి ఉందన్న విషయాన్ని సమావేశంలో స్పష్టం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. విభజన చట్టంలోని అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంటేనే సహకరించాలని స్పష్టం చేశారు. లేదంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండరాదని సీఎం అన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని అంశాలపై గతంలో అనుసరించిన విధంగానే ముందుకెళ్లాలని ఆదేశించారు. జనవరి 12 నాటికి కరోనా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని... అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమావేశంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఇదీ చూడండి: