ఆకాశాన్నంటిన సోయా దాణా ధరలు కోళ్ల పెంపకందారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చెక్క రూపంలో దిగుమతులకు కసరత్తులు జరుగుతున్నాయి. తక్షణం 20 లక్షల టన్నుల దిగుమతులకు అనుమతించాలని భారత కోళ్ల పరిశ్రమ కేంద్రాన్ని గట్టిగా కోరుతోంది. గత 2నెలలుగా దేశంలో కోడి మాంసం కిలో ధర రూ.230 నుంచి రూ.270కి చేరింది. ఇంత ధర పెరిగినా ఏమీ మిగలడం లేదని కోళ్ల పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్లకు, రొయ్యల(ఆక్వా)కు దాణాలో ప్రొటీన్‌గా వాడే సోయా చెక్క ధరలు పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సోయాచిక్కుడు గింజలను మిల్లులో గానుగాడితే నూనె ఉత్పత్తి తర్వాత మిగిలే వ్యర్థాన్ని సోయా చెక్కగా పిలుస్తారు. దీనిని తవుడు లేదా మొక్కజొన్నలతో కలిపి దాణాగా కోళ్లు, రొయ్యలకు వేస్తారు. వాటి బరువు పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయని దాణాలో దీనిని 30 శాతం కలుపుతారు. గతేడాది ఆగస్టులో టన్ను చెక్క ధర రూ.32,500 ఉండగా ఇప్పుడు రూ.90 వేలకు పెరగడంతో ఆక్వా, కోళ్లపరిశ్రమలపై ఆర్థికభారం పడింది.
మన ఎగుమతులతో మనకే ఎసరు..
గతేడాది (2020-21) మనదేశం నుంచి 20.4 లక్షల టన్నుల సోయా చెక్కను విదేశాలకు ఎగుమతి చేశారు. అంతకుముందు ఏడాది 9.84 లక్షల టన్నులని భారత సోయా శుద్ధి పరిశ్రమల సంఘం తాజాగా వెల్లడించింది. ఈ ఎగుమతులే ఇప్పుడు మనదేశంలో ఆక్వా, కోళ్ల పరిశ్రమలకు సోయా చెక్క దొరక్కుండా చేశాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో దిగుమతులు తప్పవని తెలంగాణ కోళ్ల పరిశ్రమ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తమ పరిశ్రమ కోరుతోందని ఆయన తెలిపారు.
నష్టపోయిన రాష్ట్ర రైతులు
తెలంగాణలో నాణ్యమైన సోయా పంటను నాలుగేళ్ల క్రితం వరకూ 7 లక్షల ఎకరాలకు పైగా వేసేవారు. గతేడాది నుంచి విత్తనాల కొరత ఉందని, ఈ పంట సాగు వద్దని వేరేవి వేసుకోవాలని వ్యవసాయశాఖ ప్రచారం చేసింది. ఈ వానాకాలంలో కూడా రైతులకు అదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు దేశ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో మధ్యప్రదేశ్‌లో సోయా పంట క్వింటాకు రూ.9,800 దాకా చెల్లించి వ్యాపారులు కొంటున్నారు. ప్రస్తుతం మద్దతుధర క్వింటాకు రూ.3,880 కాగా వచ్చే అక్టోబరు నుంచి రూ.3,950 ఇవ్వాలని కేంద్రం ప్రకటించింది. ఈ వానాకాలంలో రాష్ట్ర సాధారణ విస్తీర్ణం 4.50 లక్షల ఎకరాలకు గాను 3.50 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు వేశారు.
ఇదీ చదవండి: Plastic: పర్యావరణానికి పెను సవాల్‌గా ప్లాస్టిక్.. రెండేళ్లలో ఎంత శాతం పెరిగిందో తెలుసా!