మమత తండ్రి లెక్కల మాస్టారు. డిగ్రీ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి రిటైరయ్యాక... వ్యవసాయంపై ప్రేమతో పొలం బాటపట్టారు. ఆయన ప్రభావం కూతురిపైనా పడింది.
చిన్నతనం నుంచీ వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్న మమత రైతులకు ఉపయోగపడేలా ఏదైనా కొత్త సాంకేతికతను అందించాలనుకుంది. ఆ క్రమంలోనే అరుదైన అగ్రి డేటా మైనింగ్ రంగంలో అడుగుపెట్టింది. ‘మాది సూర్యాపేట దగ్గర్లోని కేతేపల్లి. నా చదువంతా నల్గొండలోనే సాగింది. స్వామి రామానందతీర్థ కళాశాలలో బీటెక్ కంప్యూటర్‌సైన్స్ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఎంటెక్ చేశా. ఆ తర్వాత ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశా. చదువుకోవాలన్న ఆసక్తితో గచ్చిబౌలిలోని ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్‌ఐటీ)’లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకున్నా. 2014లో కంప్యూటర్ సైన్స్‌లో సీటు వచ్చింది. ‘ఐటీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్(ఐటీఏఆర్‌డీ)’ ఆచార్యుడు పి.కృష్ణారెడ్డి నేతృత్వంలో ‘వ్యవసాయంలో డేటా మైనింగ్’ అనే అంశంపై పరిశోధన చేయడం మొదలుపెట్టా’ అంటూ తానీ రంగంలో ఎలా అడుగుపెట్టిందో వివరించింది మమత.
వాతావరణ విపత్తులను జయించే విషయంలో రైతులకు అండగా ఉండేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే మారిన వాతావరణ పరిస్థితులని ఎప్పటికప్పుడు విశ్లేషించి అందుకు తగిన విధంగా రైతుని సన్నద్ధం చేయడం శాస్త్రవేత్తలకు అంత తేలికైన విషయం కాదు. తగిన సమయం ఉండాలి. ఉన్న సమయంలో ఎక్కువమంది రైతులకు ఈ సమాచారాన్ని చేరవేయాలి. ఈ పనిని తేలిక చేసి ఎక్కువ మంది అన్నదాతలకు మేలు చేసే లక్ష్యంతో ముందడుగు వేసింది మమత. ‘వాతావరణ మార్పులకనుగుణంగా రైతులకు సలహాలు, సూచనలు అందించే ప్రక్రియ తెలంగాణలో 2008 నుంచే అందుబాటులో ఉంది. తెలంగాణలో 589 మండలాలుండగా రెండు, మూడు మండలాలను కలిపి ఒక బ్లాకుగా ఏర్పాటు చేశారు. ఇందులో ఆరు నెలల కిందటి వరకూ కొన్ని బ్లాకులకు చెందిన రైతులకు మాత్రమే వాతావరణ సమాచారం వెళ్లేది.
ఈ సమస్యను అధిగమించేందుకు మా డేటా సాయపడుతుంది. అదెలాగంటే... ఇఅగ్రోమెట్ అనే సాంకేతికతను వాడుకుని మేం గడిచిన 30 సంవత్సరాల వాతావరణ డేటాను విశ్లేషించాం. అప్పుడు మాకు కొన్ని ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. ప్రతి ఏడాది వాతావరణ పరిస్థితులు మారుతున్నట్టుగానే కనిపించినా... కొన్నిసార్లు పునరావృతమై కనిపించాయి. అలా ఎప్పుడెప్పుడు జరిగిందో విశ్లేషించి... మళ్లీ అదే వాతావరణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో ఊహించాం. దాని వల్ల ఉపయోగం ఏంటంటే... గడిచిన అదే సంవత్సరం శాస్త్రవేత్తలు పంటల కోసం ఇచ్చిన సలహాలు తిరిగి అందివ్వొచ్చు. దీనివల్ల శాస్త్రవేత్తలకు సమయం ఆదా అవుతుంది. అలాగే పక్కపక్క బ్లాకులకు కూడా ఒకే రకమైన వాతావరణం ఉన్నట్టు తేలితే అక్కడి రైతులకూ ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఈ డేటాను ఇఅగ్రోమెట్‌లో భద్రపరిచి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు చేరవేస్తాం’ అంటోంది మమత. - అమరేంద్ర యార్లగడ్ల, హైదరాబాద్