ఎస్సీ ఉప కులాలను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు అప్పగిస్తే... దాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై... హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని స్ఫూర్తి భవన్ వద్ద ఉన్న అబేడ్కర్ విగ్రహాం ఎదుట నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీలను వేర్వేరుగా కాకుండా ఓ సముదాయంగా పరిగణిస్తూ... భారత రాజ్యాంగంలో బీఆర్ అంబేడ్కర్ రిజర్వేషన్లు కల్పించారని చెన్నయ్య గుర్తు చేశారు.
దేశంలో దాదాపు 1209 ఎస్సీ ఉపకులాలకు ఇప్పుడున్న రిజర్వేషన్ల శాతాన్ని ఎలా పంచుతారని ప్రశ్నించారు. వర్గీకరణ అనేది కేవలం ఒకటి, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాదన్నారు. ఇప్పటికైనా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చే అంశాన్ని పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తేనె తుట్టెలాంటి ఈ సమస్యను కదిపితే పార్టీలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెన్నయ్య హెచ్చరించారు.