ETV Bharat / city

జగదానందకారుని జన్మ స్థలంలో మందిరం - lord rama temple construction in ayodhya

త్రేతాయుగం. సరయూ నది ఒడ్డున... అయోధ్య నగరంలో... చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో దశరథమహారాజు, కౌసల్యాదేవి దంపతులకు రాముడు పుట్టాడు. కలియుగం. యమునా నది ఒడ్డున...  దిల్లీ మహానగరంలో... 2019 నవంబరు 9న... దేశ అత్యున్నత న్యాయస్థానంలో రాముడు గెలిచాడు.

lord-rama-connection-with-ayodhya-as-the-ram-mandir-is-under-construction
జగదానందకారుని జన్మ స్థలంలో మందిరం
author img

By

Published : Jun 7, 2020, 5:55 PM IST

లోక కల్యాణం కోసం తాను తలపెట్టిన యజ్ఞానికి రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారనీ, వాళ్ల ఆటలు కట్టించడానికి రాముడిని తన వెంట పంపమనీ విశ్వామిత్రుడు అడిగినప్పుడు ఆ తండ్రి దశరథుడికి ఎంత కష్టం కలిగిందో- తమ రాముడి పరిస్థితి చూసి నిన్నమొన్నటి దాకా అయోధ్యావాసులకూ అంతే కష్టం కలిగింది. రాముడి గుడి లేని ఊరు ఊరే కాదు అనుకునే దేశంలో... అదీ జగదానందకారకుడి జన్మస్థలమైన అయోధ్యలో... రాముడికి గుడి లేదనే వారి బాధకి ఎట్టకేలకు తెరపడింది.

వివాదాస్పద స్థలంగా దశాబ్దాల తరబడి న్యాయస్థానంలో నానుతూ వచ్చిన రామజన్మభూమి నిస్సందేహంగా ‘రామ్‌లల్లా విరాజ్‌మాన్‌(కొలువుదీరిన చిన్నారి రాముడు)’దేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ తీర్పు దేశంలోని రామభక్తులందరినీ ఆనందంలో ముంచెత్తింది.

రాముడు పుట్టిన చోటే ఆ రాముడికి ఓ అందమైన గుడి కడితే అందులో కొలువైన దేవుడిని చూసి తరించాలనుకుంటున్నవారి కలలు పండే రోజు ఇక ఎంతో దూరం లేదు. అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో మందిర నిర్మాణం మొదలైంది. అపూర్వమైన శిల్పకళతో ‘న భూతో న భవిష్యతి’ అన్న రీతిలో ఓ అద్భుతమైన దేవాలయం రూపుదిద్దుకోబోతోంది.

lord Rama temple construction in ayodhya
అయోధ్యలో రామ మందిరం.

డెబ్బై ఏళ్ల క్రితం

వందల, వేల ఏళ్ల చరిత్ర సంగతి పక్కన పెడదాం. దశాబ్దాల క్రితం వరకూ అయితే అక్కడ ఓ మసీదు ఉండేది. అది రామజన్మభూమి కాబట్టి ఆ స్థానంలో మందిరం కట్టాలన్న ఉద్యమం ఎప్పుడో నూట యాభై ఏళ్ల క్రితమే మొదలైంది. దాంతో దాన్ని వివాదాస్పద స్థలంగా ప్రభుత్వాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి.

అలా ఉండగా 1949లో ఊహించని ఓ సంఘటన జరిగింది. గోరఖ్‌నాథ్‌ మఠానికి చెందిన సంత్‌ దిగ్విజయ్‌నాథ్‌ అఖిల భారతీయ రామాయణ మహాసభతో కలిసి తొమ్మిది రోజులపాటు రామ చరిత మానస్‌ పారాయణం చేశారు. సరిగ్గా అది ముగిసిన మర్నాడే- అంటే డిసెంబరు 22న వివాదాస్పద కట్టడంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు వెలిశాయి. కాపలా ఉన్న పోలీసు వారిస్తున్నా వినకుండా కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి వేళ గేటు బలవంతంగా తెరిచి విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెట్టారని కథనం.

పెట్టినవారెవరో ఎవరికీ తెలియదన్నారు. ఆ విగ్రహాలను తొలగించాలంటూ కొందరూ, కాదు అక్కడ మందిరం కట్టించాలనీ విగ్రహాలకు పూజ చేసుకోడానికి అనుమతి ఇవ్వాలనీ కొందరూ... కోర్టులో కేసుల మీద కేసులు వేశారు. ప్రభుత్వం ఆ ప్రదేశానికి తాళాలు వేసింది. తర్వాత కొంతకాలానికి ఆ దేవుళ్ల విగ్రహాలకు నిత్యపూజలు చేసుకోవడానికి మాత్రం పూజారులను అనుమతించింది. అలా రామజన్మభూమిలోకి రాముడు చేరుకున్నా, ఆ రాముడికి పూజలు అందుతున్నా... ఓ ఆలయంగా భక్తులు చూసుకునే భాగ్యం మాత్రం కలగలేదు.

ఇరవై ఏడేళ్లుగా టెంటులోనే...

1992 డిసెంబరు 6 సంఘటన తర్వాత రాముల వారి విగ్రహాలను వివాదాస్పద స్థలం నుంచి తీసి పక్కనే ఒక టెంటు కింద ఏర్పాటుచేసిన వేదిక మీద ఉంచారు. పూజాదికాల నిర్వహణకు సిబ్బందిని నియమించి, భక్తులు సందర్శించుకునేందుకు అనుమతించారు. అయితే పటిష్ఠమైన బందోబస్తు ఉండేది. భక్తులను ఒక్కొక్కరినే నాలుగు దశల్లో తనిఖీలు చేసిగానీ పంపించేవారు కాదు.

ఆ తనిఖీలన్నిటినీ దాటుకుని దేవుడి ముందుకు వెళ్తే కేవలం కొద్ది సెకన్లు మాత్రమే దర్శనభాగ్యం కలిగేది. ఖాళీ చేతులతో వెళ్లి దండం పెట్టుకుని వచ్చేయాల్సి రావటంతో భక్తులకు తీవ్ర అసంతృప్తిగా ఉండేది. విషయం న్యాయస్థానంలో ఉండటంతో విస్తృతమైన ఏర్పాట్లు చేసుకోడానికిగానీ వేడుకలకుగానీ ఎక్కువ డబ్బు ఖర్చు చేసే వెసులుబాటు ఉండేది కాదు. ఆ టెంటును కూడా పదేళ్లకోసారి మార్చేవారు. ఏడాదికోసారి శ్రీరామనవమి సందర్భంగా విగ్రహాలకు నూతన వస్త్రాలను మాత్రం సమకూర్చేవారు.

డబ్బు లేక కాదు...

‘రామ్‌లల్లా విరాజ్‌మాన్‌’ పేరున అయోధ్యలోని ఎస్‌బీఐ బ్యాంకులో ఖాతా ఉంది. 2005-06లో ఆ ఖాతాలో రూ. ఏడు లక్షలు మాత్రమే ఉండగా 2013 కల్లా అది రూ.2.7 కోట్లు అయింది. అంటే రామచంద్రుడి ఆదాయం ఏడేళ్లలో 40 రెట్లు పెరిగిందన్న మాట. 1995 వరకూ రామ మందిరానికి వచ్చిన విరాళాలను ప్రభుత్వం అయోధ్యలోని ఇతర దేవాలయాల నిర్వహణకు మళ్లించేది.

ఆ తర్వాతే రాముడి పేర ప్రత్యేక ఖాతాని తెరిచారు. అందులోని డబ్బుని ఆలయ నిర్వహణకూ, పూజారి, ఇతర సిబ్బంది జీతభత్యాలకూ వాడటం మొదలెట్టారు. ఇతర దేవాలయాలతో పోలిస్తే ఇది చిన్న మొత్తమే అయినప్పటికీ గత పదేళ్లుగా విరాళాలు క్రమేణా పెరుగుతూ వచ్చాయి.

రాముడే యజమాని

దశాబ్దాల పాటు సాగిన రామజన్మభూమి వివాదంలో ఎన్నో వింతలూ విశేషాలూ చోటుచేసుకున్నాయి. వివాదాస్పద స్థలం మాకు చెందాలంటే కాదు మాకు చెందాలని పోరాడిన మూడు పక్షాలనూ కాదని ఆ స్థలం సొంతదారు రాముడేనని స్పష్టం చేసింది న్యాయస్థానం. రాముడి తరఫున ఓ సంరక్షకుడిని నియమించాలనీ, దేవాలయ నిర్మాణాన్ని స్వతంత్ర ట్రస్టుకి అప్పజెప్పాలనీ సూచించింది.

దాంతో రాముడి తరఫున కోర్టులో కేసు వాదించిన కేశవ అయ్యంగార్‌ పరాశరన్‌నే సంరక్షకుడిగా నియమించింది ప్రభుత్వం. ‘శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ పేరుతో పదిహేను మంది సభ్యులతో గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్వతంత్ర ట్రస్టుకి కూడా నాయకత్వం వహిస్తున్నారు 92 ఏళ్ల పరాశరన్‌. రామ మందిర నిర్మాణ బాధ్యత అంతా ఇప్పుడీ ట్రస్టుదే. మహంత్‌ నృత్యగోపాల్‌దాస్‌ ట్రస్టు అధ్యక్షులుగా ఉన్నారు. కోర్టు అప్పజెప్పిన 2.77 ఎకరాలకు తోడు 1990ల్లోనే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమితో కలిపి మొత్తం 67.703 ఎకరాలను ప్రభుత్వం ఈ ట్రస్టుకు బదిలీ చేసింది.

విరాళాలతో నిర్మాణం

గతంలో గుజరాత్‌లోని సోమనాథ్‌ మందిర పునర్నిర్మాణాన్ని అచ్చంగా విరాళాలతో చేపట్టినట్టు ఇప్పుడు అయోధ్య రామమందిరాన్ని కూడా అలాగే కట్టాలని నిర్ణయించారు. అందుకోసం మరో ప్రత్యేక ఖాతా తెరిచారు. తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ అండర్‌ సెక్రెటరీ ఒక రూపాయి విరాళాన్ని ఇచ్చారు.

తర్వాత లాక్‌డౌన్‌ ఉన్న గత రెండు నెలల్లోనే ఈ ఖాతాకు రూ. 4.60 కోట్ల విరాళాలు వచ్చాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక విరాళాలు మరింత ఎక్కువగా రావచ్చని భావిస్తున్నారు. డబ్బు ఎంత ఉంది అని చూసుకోకుండా అనుకున్న ప్రణాళిక ప్రకారం తాము మందిర నిర్మాణం చేస్తూ పోవాలనీ, అవసరానికి డబ్బు దానంతటదే సమకూరుతుందనీ ట్రస్టు భావిస్తోంది. ఆలయ నిర్మాణానికి ఎవరైనా ఏ రూపంలోనైనా విరాళాలను ఇవ్వవచ్చనీ, శ్రమదానం చేయవచ్చనీ ట్రస్టు సభ్యులు చెబుతున్నారు.

నిజానికి శ్రీరామనవమి లేదా అక్షయతృతీయ రోజున మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ అందుకు అడ్డురావడంతో మే చివరి వారంలో ప్రారంభించారు.

పనులు మొదలుపెట్టడానికి ముందుగానే మార్చి 25న టెంట్‌లోని దేవాలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలను మానస్‌ భవన్‌ ఆవరణలో కట్టిన మరో తాత్కాలిక దేవాలయంలోకి పల్లకీలో వేడుకగా తరలించారు. మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌, మహంత్‌ పరమహంస్‌ దాస్‌ తదితరుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేసి మందిర నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

మే రెండో వారంలోనే భూమిని చదునుచేసి, శుభ్రం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ క్రమంలో జరిగిన తవ్వకాల్లో ఐదడుగుల శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కివున్న స్తంభాలు, ఎర్రరాతి ఇసుక ధ్వజాలు, కలశం, రాతి పుష్పాల లాంటివి బయటపడ్డాయి. ఇవన్నీ పురాతన ఆలయానికి సంబంధించినవేనని అక్కడి వారు అభిప్రాయపడుతున్నారు. తవ్వకాల్లో బయటపడినవాటినన్నిటినీ భద్రం చేసి భవిష్యత్తులో ఏర్పాటుచేయబోయే మ్యూజియంలో ఉంచబోతున్నారు.

గుడి ఎలా ఉంటుందంటే...

ఇక, ఇక్కడ కట్టబోయే గుడి ఇవాళ కొత్తగా రూపకల్పన చేసింది కాదు. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో 1989లో ప్రముఖ శిల్పి చంద్రకాంత్‌ సోంపురా ఈ ఆలయ డిజైన్ని రూపొందించారు. సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణానికి రూపకల్పన చేసిన ప్రభాకర్‌ సోంపురా కొడుకైన చంద్రకాంత్‌ 130కి పైగా దేవాలయాలకు వాస్తుశిల్పిగా వ్యవహరించారు.

1984లోనే రామమందిరానికి శంకుస్థాపన చేసింది రామజన్మభూమి న్యాస్‌ సంస్థ. అప్పుడు ప్రజలు రూపాయి, రెండు రూపాయలు చొప్పున ఇచ్చిన విరాళాలే రూ.8 కోట్లు కాగా, కరసేవకపురంలో 150 మంది శిల్పులు, వందలాది కార్మికులతో పనులు కూడా ప్రారంభించింది. కొన్నేళ్ల పాటు పనిచేశాక స్థలవివాదం ఎటూ తేలకపోవడంతో వారంతా ఎవరి ఊళ్లకి వాళ్లు వెళ్లిపోయారు.

ఆనాటి ఆలయ డిజైనుకే ఇప్పుడు ఆకృతిని ఇవ్వబోతున్నారు. మొత్తం 67 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఆలయంలో గుడి శిఖరం నేల మీది నుంచి 128 అడుగుల ఎత్తు ఉంటుంది. దేవాలయం కొలతలు 268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు... ఉంటాయి. రెండంతస్తుల ఆలయంలో ఒక్కో అంతస్తులో 106 స్తంభాలు చొప్పున మొత్తం 212 స్తంభాలు ఉంటాయి.

ఒక్కో స్తంభం మీద దేవీ దేవతల విగ్రహాలు పదహారు చొప్పున చెక్కి ఉంటాయి. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించేందుకూ అవకాశం ఉందని ట్రస్టు పేర్కొంది. ఆలయం పైకప్పునకు మొత్తం రాతి స్లాబ్స్‌నే వాడబోతున్నారు. సిమెంట్‌ కానీ ఇనుము కానీ వాడకుండా అంత పెద్ద ఆలయానికి స్లాబ్‌ వేయడం విశేషమే.

చాలామటుకు ఉత్తరాది వైష్ణవ దేవాలయాలు ఉండే ‘నగర’ శైలిలో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం దేవాలయమంతా ఒక విశాలమైన, ఎత్తైన రాతి వేదిక మీద ఉంటుంది. దాని మీదికి వెళ్లడానికి మెట్లుంటాయి. దక్షిణాది గుడులలో లాగా పెద్ద పెద్ద ప్రహరీగోడలూ ద్వారాలూ ఉండవు. కుషాణుల పాలన చివరలో, గుప్తుల పాలన మొదట్లో ఇలాంటి దేవాలయాలను కట్టినట్లు చరిత్ర చెబుతోంది.

సగం పని అయిపోయినట్లే...

అధికారికంగా నిర్మాణం ఇప్పుడే మొదలెట్టినా నిజానికి సగం పని అయిపోయినట్లే చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ నేత ఎల్‌కే అడ్వాణీ చేపట్టిన రథయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా సేకరించిన ఇటుకలు మందిరం గోడల్లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక కరసేవకపురంలో రామజన్మభూమి న్యాస్‌ సంస్థ వర్క్‌షాపులో శిల్పులు చెక్కి వరసగా ఒక పద్ధతి ప్రకారం నంబర్లు వేసి పెట్టిన స్తంభాలు, శిల్పాలు, పైకప్పుకు అతికించాల్సిన పువ్వులు లాంటివన్నీ చాలావరకూ సిద్ధంగా ఉన్నాయి.

ఒకసారి పని మొదలైతే ఇక్కడ సిద్ధంగా ఉన్నవాటినన్నిటినీ తీసుకెళ్లి డిజైన్‌కి అనుగుణంగా వాటి వాటి స్థానాల్లో పెట్టి వైట్‌ సిమెంటుతో అతికించడమే ఉంటుంది. కాబట్టి మందిర నిర్మాణం త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉంది. ఎప్పుడో 1990ల్లోనే చెక్కి పెట్టిన గులాబి రంగు శాండ్‌స్టోన్‌ స్తంభాలను మరోసారి పాలిష్‌ చేస్తున్నారు. కలపతోనూ, పాలరాయితోనూ చెక్కిన గుడి నమూనాలు ఈ ఆవరణలో ఇప్పటికే సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

ఏమేం ఉంటాయంటే...

విశాల ప్రాంగణంలో రూపొందుతున్న రామ మందిరమే కాదు, మందిరం కేంద్రంగా ఏర్పాటుచేసే పలు నిర్మాణాలనూ ఆకట్టుకునేలా తీర్చిదిద్దబోతున్నారు. గర్భగుడిలో బాలరాముడికి (రామ్‌లల్లా) ప్రత్యేక సింహాసనం ఉంటుంది. ప్రధాన ఆలయంతోపాటు సీతమ్మవారి వంటిల్లు(సీతారాముల వివాహానంతరం గృహిణిగా సీత మొదటిసారి అక్కడే వంటచేశారని చెప్పుకుంటారు), సీతాకూప్‌ (వారి కుటుంబం నీటిని వాడుకున్న బావి), రామ్‌ చబూత్రా (రాముడు పుట్టిన స్థలం ఇదేనంటారు), శేషావతార్‌ మందిర్‌... తదితరాలు ఉంటాయి.

సందర్శకులు బస చేయడానికి ధర్మశాల, భజన గృహం, సాంస్కృతిక కార్యక్రమాలకు రంగమండపం... లాంటివి కూడా నిర్మించబోతున్నారు. రెండు వందల యాభై మంది శిల్పులు నిరంతరాయంగా పని చేస్తే గుడి నిర్మాణం పూర్తవడానికి అయిదేళ్లు పట్టవచ్చని గతంలో అంచనా వేశారు. ఇప్పుడు మళ్లీ ఇళ్లకు వెళ్లిన శిల్పులందర్నీ తిరిగి రప్పిస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి శిలలను తెచ్చి మరికొన్ని స్తంభాలను చెక్కాలి. పాలరాయితో చౌకత్‌లను నిర్మించాలి. కీలకమైన ఆలయ శిఖరనిర్మాణం చేపట్టాలి. ఇవి అన్నీ కూడా రెండేళ్లలో పూర్తిచేయాలన్నది ఇప్పటి లక్ష్యం.

ఎన్ని ప్రత్యేకతలో!

రామమందిర నిర్మాణం పూర్తయ్యేవరకూ సీతారాముల విగ్రహాలను ఉంచి పూజలు జరపడానికీ, భక్తులు దర్శించుకోడానికీ వీలుగా ఒక తాత్కాలిక మందిరాన్ని రామజన్మభూమి ప్రాంగణంలోనే ఉన్న మానస్‌భవన్‌లో ఒక పక్కన బులెట్‌ ప్రూఫ్‌ ఫైబర్‌తో నిర్మించారు.

తాత్కాలికమే అయినప్పటికీ ఎన్నో ప్రత్యేకతలతో దీన్ని తీర్చిదిద్దారు. ఘాజియాబాద్‌కి చెందిన నేచర్‌ హోమ్స్‌ అనే సంస్థ జర్మనీ, ఎస్తోనియాల నుంచి దిగుమతి చేసుకున్న పైన్‌ చెక్కతో కేవలం ఎనిమిది రోజుల్లో ఈ మందిరాన్ని నిర్మించింది. ఆలయనిర్మాణానికి సంబంధించిన వాస్తు నియమాలన్నిటినీ అనుసరిస్తూనే మరో పక్క భూకంపాలూ తుపానులూ వరదలూ లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా తట్టుకునేలా ఈ తాత్కాలిక ఆలయాన్ని తీర్చిదిద్దారు. 1992కి ముందు ఆలయంలో కలపతో చేసిన సింహాసనం మీద రాముడి విగ్రహం ఉండేది.

ఆ తర్వాత ట్రస్టు సభ్యులొకరు వెండి సింహాసనాన్ని చేయించారు. విగ్రహంతో సహా దాని బరువు దాదాపు తొమ్మిదిన్నర కిలోలు ఉంటుంది. మందిర నిర్మాణం పూర్తయ్యేవరకూ అయోధ్యను సందర్శించే భక్తులకు సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడు ఇక్కడే దర్శనమివ్వనున్నాడు. మందిర నిర్మాణం పూర్తయి... కొత్త ఆలయంలో శ్రీరాముడు సపరివారంగా కొలువయ్యాక... అప్పుడు ‘రామన్న రాముడూ కోదండ రాముడూ శ్రీరామచంద్రుడూ వచ్చాడురా...సీతమ్మ తల్లితో వచ్చాడురా...’ అని అయోధ్యావాసులతో పాటు మనమూ గొంతు కలిపి పాడుకోవచ్చన్నమాట.

అయోధ్యకి పూర్వవైభవం

నాటి అయోధ్య కోసల సామ్రాజ్యానికి రాజధాని. నేటి అయోధ్య నిన్నమొన్నటి వరకూ ఒక చిన్న పట్టణం మాత్రమే. ఇప్పుడు మందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలూ మారబోతున్నాయి. ఒకప్పుడు దేశంలోని ఏడు ప్రధాన తీర్థయాత్రాస్థలాల్లో(సప్తపురాలు) ఒకటిగా పేరొందిన అయోధ్యకి తిరిగి ఆ వైభవం తెచ్చి ‘నవ్య అయోధ్య’గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేపట్టింది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.

రామమందిర సందర్శనకు వచ్చే పర్యటకుల తాకిడిని తట్టుకునేలా అయోధ్యలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టింది. ఫైజాబాద్‌ జిల్లాలో ఓ భాగంగా ఉన్న అయోధ్యను ఇప్పటికే ప్రత్యేక జిల్లాగా ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో అయోధ్యలో విమానాశ్రయ నిర్మాణానికి రూ. 500 కోట్లు, రహదారుల అభివృద్ధికి మరో 85 కోట్లు కేటాయించింది. పర్యటకుల్ని ఆకర్షించేందుకు రూ. 2500 కోట్లు ఖర్చుపెట్టి సరయూ నది ఒడ్డున 151 మీటర్ల ఎత్తైన భారీ రామ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కూడా యూపీ ప్రభుత్వం తలపెట్టింది. అందుకు గానూ స్థల సేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.