సీతారామ ఎత్తిపోతల పథకంలో మూడు ప్యాకేజీల్లో లిప్టు పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన అన్ని పరికరాలు చైనా నుంచే రావాలి. మొదటి ప్యాకేజీలో ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు పంపులు, మోటార్లు చైనా నుంచి రావడంతో పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఐదో ప్యాకేజీలో ఒక్కొక్కటి 40 మెగావాట్లతో ఆరు పంపులు, మోటార్లు అమర్చాల్సి ఉండగా, ఇటీవలే ప్రధానమైనవన్నీ వచ్చాయి. అనుబంధ పరికరాలు కొన్ని రావాల్సి ఉంది.
ఆరో ప్యాకేజీలో ఐదు పంపులు, మోటార్లు 40 మెగావాట్ల సామర్థ్యంతో, రెండు పంపులు 30 మెగావాట్ల సామర్థ్యంతో అమర్చాల్సి ఉంది. ఇవన్నీ కూడా చైనా నుంచే రావాలి. షాంఘై ఇంజినీరింగ్ కంపెనీ ద్వారా ఇవి సరఫరా అవుతాయి. ఇప్పటికే బయలుదేరినట్లు సమాచారం ఉందని, ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారానికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి. వరదకాలువలో భాగంగా చేపట్టిన గౌరవెళ్లికి నీటిని ఎత్తిపోసే లిప్టునకు సంబంధించిన మోటార్లు, పంపులు కూడా రావాల్సి ఉంది.