ఎనిమిదేళ్ల తరువాత తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ రుసుములు పెరిగాయి. సుదీర్ఘంగా కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సవరించిన నూతన విలువలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లపై మూడేసి స్లాబులు, అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల విలువలు రెండు స్లాబులు లెక్కన పెరిగాయి.
సుదీర్ఘ కసరత్తు తర్వాత..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు పెరిగాయి. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇప్పటి వరకు అటు మార్కెట్ విలువలు కానీ.. ఇటు రిజిస్ట్రేషన్ రుసుములు కానీ పెరగలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత ఐటీతో పాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందడం, కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో భూముల విలువలు భారీగా పెరిగాయి. సాగునీటి వసతి పెరగడం ద్వారా ఆయకట్టు భూమి విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నిర్దేశిత మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపునకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది. అంతకుముందు మంత్రి మండలి ఉపకమిటీ... మార్కెట్ విలువల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ధరలు ఖరారు చేసేందుకు మార్కెట్ విలువల పెంపును స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ.. గ్రామ, పట్టణ కమిటీలకు బాధ్యత అప్పగించింది. కమిటీల ఛైర్మన్లు, కన్వీనర్లు, సభ్యులు సంతకాలు చేసిన హార్డ్ కాపీలను మంగళవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆయా జిల్లా రిజిస్ట్రార్లు అందజేశారు.
రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు..
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ రుసుములను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ రుసుములు రేపటి నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అమలులో ఉన్న 6 శాతం రిజిస్ట్రేషన్ రుసుంను 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. స్లాబుల వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర రూ.100 నుంచి రూ.200లకు పెంచిన ప్రభుత్వం.. స్లాబులు వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువలను పెంచినట్లు స్పష్టం చేసింది. ఆలాగే అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ రూ.800 నుంచి రూ.1000కి పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సవరించిన మార్కెట్ విలువలపై ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1800 599 4788 ను, మెయిల్ చిరునామా ascmro@telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేసింది. భూములు, ఆస్తుల విలువ పెంపునకు తగ్గట్లుగా సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
రూ.4 వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం..
మరోవైపు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ రుసుము పెరగడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 4 వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరనుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.