ఈ ఫోటోలో కనిపిస్తున్నది నీటి మీటర్లు అంటే నమ్మండి. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజులు పనిచేశాయి. తర్వాత.. ఇదిగో.. ఇలా మూలకు చేరాయి. మీటర్ రీడింగ్ సిబ్బంది కూడా పట్టించుకోవడం మానేశారు. ఎంతో కొంత బిల్లు వేసి చేతికి ఇచ్చేస్తున్నారు. మీటరు పనిచేయక పోయినా.. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదంటే నిర్లక్ష్యం ఎంతలా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ఇది కూడా నీటి మీటరే. మూడేళ్లుగా మూలకు చేరడంతో.. రీడింగ్ కూడా చూపించడం లేదు. పని చేస్తుందో లేదో కూడా తెలియదు. అయినా మీటర్ రీడర్లకు ఇవి పట్టడం లేదు.
గ్రేటర్‌లో నీటి మీటర్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. చాలా కంపెనీల మీటర్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నీటి పథకం కిందకు రావాలంటే ప్రతి లబ్ధిదారుడు నల్లా కనెక్షన్‌కు మీటరు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. మురికివాడల్లో మినహా మిగతా నల్లాదారులంతా మార్చి 31లోపు మీటర్లను తప్పనిసరిగా అమర్చుకోవాలి. లేదంటే యథావిధిగా నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.
ఉచిత నీటి పథకానికి మురికివాడల్లోని నల్లాలు మినహా మిగతా 7.87 లక్షల నల్లాలకు మీటర్లు తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న మీటర్లలో 2.20 లక్షలే పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి మీటరు తిరగకపోతే.. రీడర్లు గుర్తించి సంబంధిత ఇంటికి నోటీసులు ఇవ్వాలి. కానీ అలా చేయకుండా సరాసరి బిల్లులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉచిత నీటి పథకంలో భాగంగా ప్రతి మీటరు పనిచేయాలి. ప్రతి కుటుంబానికి 20 వేల వరకు ఉచితంగా.. ఆపై సరఫరా చేసే నీటికి బిల్లులు వసూలు చేయాలంటే మీటరు రీడింగే కీలకం. ఈ క్రమంలో మీటర్లలో నాణ్యత చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.
లోపాలు ఇలా..
● నగరవ్యాప్తంగా వ్యక్తిగత గృహాలకు మెకానిక్ మీటర్లనే వాడుతున్నారు. బల్క్ సరఫరా కనెక్షన్లు మాత్రమే స్మార్ట్ మీటర్లను వినియోగిస్తున్నారు. పలు కంపెనీలకు చెందిన మెకానిక్ మీటర్లలో నాణ్యత ఉండటం లేదు.
● మెకానిక్ మీటర్లను సులువుగా టాంపరింగ్ చేసే వీలుంది. రీడింగ్ తిరగకుండా చేయొచ్ఛు నగరవ్యాప్తంగా ఈ తంతు నడుస్తున్నట్లు విజిలెన్సు అధికారులు గుర్తించారు.
● మీటరు తిరగకుండా టాంపరింగ్ చేయడం వల్ల 20 వేల లీటర్లకు మించి నీటిని సరఫరా చేసినా.. అది గుర్తించే వీలు ఉండదు. 20 వేల లీటర్ల కంటే ఎక్కువ నీటిని వాడుకుంటే ఆ అదనపు బిల్లు నుంచి తప్పించుకునే వీలు ఉంటుంది. ఇలా జలమండలి పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది.
* ప్రస్తుతం పెద్ద సంఖ్యలో మీటర్లకు డిమాండ్ ఏర్పడనుంది. ఇదే అదనుగా కంపెనీలు నాణ్యతలేనివి అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంది. జలమండలి 15 ఎంఎం, 20 ఎంఎం మీటర్లకు ధరలు నిర్ణయించింది. ఇవి ఎంతవరకు అమలు అవుతాయనేది ప్రశ్నార్థకమే.
* మీటర్లకున్న డిమాండ్ దృష్ట్యా 24 కంపెనీలను జలమండలి ఎంప్యానల్ చేసింది. ఈ వివరాలు జలమండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. వీటిలో పలు కంపెనీల మీటర్లను వినియోగదారులు వాడుతున్నారు. రెండు, మూడు నెలల తర్వాత ఇవి మూలకు చేరుతున్నాయని వాపోతున్నారు.
* మెకానిక్ మీటర్లను టాంపరింగ్ చేసినా గుర్తించడం కష్టమే. ఆర్‌ఎఫ్‌ఐడీ, స్మార్ట్ మీటర్లలోని సాంకేతిక పరిజ్ఞానం వీటిలో ఉండదు. వీటిని టాంపరింగ్ చేస్తే.. వెంటనే సర్వర్‌కు సమాచారం అందుతుంది.
* జలమండలి పరిధిలోని మీటరు రీడర్ల పనితీరుపై ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి రీడింగ్ తీసి బిల్లులు మంజూరు చేయాలి. చాలామంది ఇళ్లకే వెళ్లడం లేదు. దీంతో మీటర్లు తిరగకపోయినా.. పట్టించుకునే నాథుడే లేడు.