ప్రజలు-సంస్థలు/ప్రభుత్వాల మధ్య వారధిలా.. పనిచేస్తూ.. ఇరువైపు సమాచారాన్ని చేరవేస్తూ.. రెండు వైపులా ప్రయోజనం చేకూరేలా చేరడంలో పీఆర్ అధికారులది కీలకపాత్ర. అందుకే పౌరసంబంధాల అధికారి(పీఆర్‌వో) ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. మరి మీరు పీఆర్ రంగంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? ఓ సంస్థకు పీఆర్‌వో కావాలంటే కావాల్సిన నైపుణ్యాలేంటో చూడండి మరి..
ఆకట్టుకునే కంటెంట్ రాయాలి
సంస్థ ప్రాజెక్టు ప్రచారం కోసం పీఆర్‌వో స్పష్టంగా.. సరళంగా అక్షరరూపం ఇవ్వగలగాలి. సందర్భాన్ని బట్టి.. సమయోచితంగా ఆకట్టుకునేలా విషయాన్ని రాయడం పీఆర్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణం.. నైపుణ్యం. అంతేకాదు.. రాసిన దాన్ని ఎదుటివాళ్లు ఎలా అర్థం చేసుకుంటారనే దానిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
ఓపికతో వినాలి
సంస్థ ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే.. ముందుగా ఆ ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇందుకోసం యాజమాన్యం చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినాలి.. అర్థం చేసుకోవాలి. పీఆర్‌వో సంస్థకు కళ్లు.. చెవులులాంటివాడంటారు. సంస్థ చెప్పే విషయాల్ని తన చెవులతో విని.. ప్రపంచానికి తన కళ్లతో చూపించగలగాలి.
కమ్యూనికేషన్
సంస్థ యాజమాన్యానికి.. బయటి వ్యక్తులకు పీఆర్‌వో ఒక వారధిలా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యాజమాన్యాన్ని మెప్పించాలన్నా.. క్లయింట్స్/ప్రజలను ఆకట్టుకోవాలన్నా.. మాట్లాడే విధానం బాగుండాలి. అంటే.. కమ్యూనికేషన్ నైపుణ్యం అవసరమవుతాయి.
చురుకుదనం.. మల్టీ టాస్కింగ్
పీఆర్ అధికారి ఎంత చురుకుగా ఉంటే.. పనుల్లో ఫలితాలు అంత బాగుంటాయి. ఒక్కోసారి బహుళ సంఖ్యలో ప్రాజెక్టులు వస్తే.. మల్టీటాస్కింగ్ చేయాల్సి వస్తుంది. అయినా.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తోటి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపుతూ వారితో పనిచేయించుకోగల సామర్థ్యం కావాలి.
సోషల్‌మీడియాపై పట్టు
ఈ టెక్ యుగంలో సోషల్‌మీడియాను ఉపయోగించని వ్యక్తులుండరు. అందుకే సోషల్‌మీడియా ఈ మధ్య మంచి ప్రచారసాధనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పీఆర్‌వోకి సోషల్‌మీడియాలో ప్రచారానికి డిజిటల్ కంటెంట్‌ను సృష్టించడంలో పట్టు ఉండటం తప్పనిసరి. ఎప్పటికప్పుడు మారే సోషల్‌మీడియా ట్రెండ్‌ను అనుసరిస్తూ.. కంటెంట్‌ను రూపొందించాలి. అయితే, సోషల్‌మీడియా వేదికలు భిన్నంగా ఉంటాయి. ఏ సోషల్‌మీడియాను ఏ విధంగా ఉపయోగించాలనే విషయంలో పీఆర్‌వోకి స్పష్టత ఉండాలి. ఉదాహరణకు యూట్యూబ్‌లాంటి వీడియో సోషల్ మీడియాలైతే వీడియో రూపంలో.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ లాంటి సోషల్‌మీడియా వేదికలపై ఫొటో, అక్షరాల రూపంలో కంటెంట్‌ను సృష్టించాల్సి ఉంటుంది.
పరిశోధన
ఏ ప్రాజెక్టుకైతే పీఆర్‌వోగా పనిచేస్తున్నారో ఆ ప్రాజెక్టు గురించి లోతుగా పరిశోధన చేయాలి. ఆ ప్రాజెక్టులాంటివే గతంలో ఏమైనా ఉన్నాయా? వాటికి ప్రచారం ఎలా జరిగింది? ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైంది. తాము చేపట్టిన ప్రాజెక్టులో పీఆర్‌వో విభాగం విజయవంతం కావాలంటే ఏం చేయాలనే దానిపై పరిశోధించి.. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి.
సమయపాలన
సంస్థ ఒక ప్రాజెక్టును చేపట్టే ముందు వాటి ఖర్చులను.. ఫలితాలు పొందే సమయాన్ని అంచనా వేస్తుంటుంది. అ సమయంలోపే యాజమాన్యం ఆశించిన మేరకు ప్రాజెక్టు గురించి ప్రచారం కల్పించి.. ఫలితాలను రాబట్టాల్సిన బాధ్యత పీఆర్‌వోపై ఉంటుంది. కాబట్టి అప్పగించిన పనిని ఇచ్చిన సమయంలో ఏ విధంగానైనా పూర్తి చేయాలి. ఇందుకోసం కొన్నిసార్లు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చినా వెనకడుగు వేయకూడదు.
సృజనాత్మకత
చేసే పని సాదాసీదాగా ఉంటే.. ఎవరూ గుర్తించరు. వాటిలో భిన్నత్వం కనిపించాలి. సృజనాత్మకంగా ఉంటేనే ఎదుటివాళ్ల దృష్టిని మనవైపునకు తిప్పుకోగలం. లక్షిత ప్రజల్లోకి వెళ్లే ప్రచారం ఎంత భిన్నంగా.. ఆకర్షణీయంగా ఉంటే అంత ఆదరణ లభిస్తుంది. కాబట్టి పీఆర్‌వో ఎల్లప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించాలి.
ఆలోచనలు అంతర్జాతీయ స్థాయి
ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న నేపథ్యంలో ప్రాంతీయ వ్యాపారాలు కూడా దేశవిదేశాలకు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్‌వో ఆలోచనలు ఒక ప్రాంతానికీ పరితమయ్యేలా ఉండకూడదు. అవసరాలకు తగ్గట్టూ ప్రపంచస్థాయిలో రాణించగలగాలి. ఇందుకోసం విదేశాల్లో ఉన్న ట్రెండ్స్ కనిపెట్టి.. దానికి తగ్గట్టు వారి భాషలోనే సంస్థ గురించి ప్రచారం చేయాలి. ఈ క్రమంలో ఇతర భాషలపై కూడా కాస్త పట్టు సాధిస్తే గొప్ప ఫలితాలు సాధించగలరు.
- ఇదీ చదవండి : Paytm IPO: నేటి నుంచి పేటీఎం ఐపీఓ షురూ