రాష్ట్రవ్యాప్తంగా కార్తిక పౌర్ణమి(karthika pournami 2021) వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పున్నమి సందర్భంగా మహిళలు ఆలయాలకు పెద్ద ఎత్తున వచ్చి దీపారాధన చేస్తున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో కార్తిక శోభ(karthika pournami in yadadri) విరాజిల్లుతోంది. యాదాద్రీశ్వరుడి దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. కార్తిక దీపారాధన చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
పుణ్యస్నాలు కోసం పోటెత్తిన భక్తులు
కార్తిక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం(karthika pournami in bhadradri)లోని గోదావరి నది వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేస్తూ కార్తిక దీపాలు వదులుతున్నారు. అనంతరం గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో గోదావరి ప్రాంతం కిటకిటలాడుతోంది.
ఆలయాల్లో భక్తుల సందడి
హనుమకొండలోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల ఆలయం(thousand pillar temple)లో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రుద్రేశ్వరున్ని దర్శించుకుని ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం వద్ద దీపాలు వెలిగించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఖిలావరంగల్ స్వయంభూ ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది.
దీపాలతో వెలుగులీనుతున్న గోదావరి
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం(dharmapuri lakshmi narasimha swamy temple)లో కార్తికపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు వదిలిన దీపాలతో గోదావరి నది వెలుగులీనింది. గోదావరిలో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రస్వామి పుణ్యస్నానం ఆచరించారు. వెల్గటూరు మండలం కోటిలింగాలలో కార్తిక పూర్ణిమ పురస్కరించుకుని పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
ఖమ్మం జిల్లా మధిరలో కార్తిక పౌర్ణమి(karthika pournami in khammam) వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచే మహిళలు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న మధిర శివాలయానికి ఖమ్మం, కృష్ణా జిల్లాలోని గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ నాచారం(kartika purnima 2021)లోని శ్రీ మహంకాళి సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తరలివస్తున్నారు. దీపాలు వెలిగించి శివయ్యకు మొక్కలు చెల్లించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక దీపాల వెలుతురుతో ఆలయాలు శోభను సంతరించుకున్నాయి.
ఆలయాల్లో దీపకాంతులు
నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ ఆలయం(karthika pournami 2021)లో కార్తిక పౌర్ణమి పూజల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. శివయ్యకు అభిషేకం నిర్వహించారు. అనంతరం కార్తిక దీపారాధన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. గుడి పరిసర ప్రాంతాల్లో దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో వెలుగులీనుతోంది.
దీపారాధనకై పోటెత్తిన భక్తజనం
నల్గొండ జిల్లా చెర్వుగట్టు ఆలయం(karthika pournami 2021)లో భక్తులు కార్తిక పౌర్ణమి పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీజడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు దీపారాధన చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా గుట్టపైకి వాహనాల అనుమతి నిరాకరించారు. పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.