మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్టు ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి? అని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను ప్రశ్నించారు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని నిలదీశారు. శాంతిభద్రతలు పరిరక్షించే విధానం ఇదేనా సమాధానం చెప్పాలని డీజీపీని డిమాండ్ చేశారు. కళా వెంకట్రావుపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
'ఓటు బ‌్యాంకు రాజకీయాల కోసం కుట్ర జరుగుతోంది. ప్రవీణ్ చక్రవర్తి ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలి. ఏపీలో బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయి. కళా వెంకట్రావును అర్ధరాత్రి అరెస్టు చేస్తారా? ఇష్టం వచ్చినట్లు చేద్దామంటే మీ ఆటలు సాగవు.' అని చంద్రబాబు హెచ్చరించారు. దేవినేని ఉమను అరెస్టు చేసి అనేక స్టేషన్లకు తిప్పారని మండిపడ్డారు. ఇంటికి వచ్చి కొడతామన్న మంత్రులపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం, హోంమంత్రి, డీజీపీ ఒకే మతం వాళ్లయితే ఏమవుతుందన్నారు. ఆలయాలపై 145 దాడులు జరిగాయి.. ఏం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. దాడులు జరిగాయని చెప్పేవారిపై కేసులు పెడతారా? అని అడిగారు.
కోర్టులు చివాట్లు పెట్టినా మీకు లెక్కలేదా?. ఐపీసీ అమలు చేస్తున్నారా.. వైకాపా కోడ్ అమలు చేస్తున్నారా... అంబేడ్కర్ రాజ్యాంగం కాదని రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తారా?. తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతిచ్చి ఎలా రద్దు చేస్తారు?. సీఎం క్రైస్తవుడు కనుక బలవంతపు మతమార్పిళ్లు జరుగుతున్నాయనడం తప్పా? క్రైస్తవ సంఘాలతో నాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఎవరింట్లో ఉన్నారో పోలీసులు చెప్పాలి.
- చంద్రబాబు, తెదేపా అధినేత
- ఇదీ చదవండి : పంచాయతీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్