Pawan kalyan on AP PRC: నూతన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఏపీ ఉద్యోగ సంఘాలు చేపట్టిన ‘చలో విజయవాడ’ ర్యాలీపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం బాధ కలిగించిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన వైకాపా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని గురించే పట్టించుకోలేదని విమర్శించారు. అధికారంలోకి రావడానికి ఒక మాట.. వచ్చాక మరో మాట చెప్పి వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను వంచించిందని పవన్ మండిపడ్డారు.
ఉద్యోగుల జీతాలు భారీగా పెంచుతామని హామీలిచ్చిన ప్రభుత్వం.. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచలేదని, ఒకవైపు జీతాలు పెంచామని చెబుతూనే.. వారి జీతాల్లో కోత విధించడం ఉద్యోగులను మోసం చేయడమేనని పవన్ విమర్శించారు. ఉద్యమంలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం లేదని ఉద్యోగ సంఘాలు చెప్పినందునే ఈ అంశంపై ఇప్పటి వరకు మాట్లాడలేదని పవన్ పేర్కొన్నారు.
చర్చల పేరుతో ఉద్యోగులను అవమానించారు..
'వివిధ శ్లాబులుగా ఉన్న హెచ్ఆర్ఏను రెండు శ్లాబులకు కుదించడం వల్లే ఒక్కొక్కరికీ రూ.5 వేలు నుంచి రూ. 8 వేలు వరకు జీతం తగ్గిందని ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై ఉద్యోగులు పలుసార్లు విన్నవించుకున్నారు. సంబంధిత మంత్రులు కానీ, అధికారులు కానీ పట్టించుకోకపోవడం, చర్చలకు పిలిచి అవమానించేలా మాట్లాడడం వల్లే ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగులు రోడ్లు మీదకొచ్చారు. ఉద్యోగులను చర్చల పేరుతో పిలిచి అవమానించారు. ఉద్యోగుల నిరసనకు కారణం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే.'
- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ప్రశాంత వాతావరణంలో చర్చలు జరగాలి..
'వైకాపా నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేపట్టాలి. ఉద్యోగులను అవమానించేలా.. రెచ్చెగొట్టేలా మాట్లాడకూడదు. వారి న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలి. ఉద్యోగుల నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది' అని పవన్ పేర్కొన్నారు.
ఇదీచూడండి: Chalo Vijayawada: ''చలో విజయవాడ' సక్సెస్.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి'