అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితి అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. రోడ్డు బాగు చేయమంటే వేధింపులు... లాఠీ ఛార్జీలు... అరెస్టులు చేయడాన్ని పవన్ తప్పుబట్టారు. పాడైన రోడ్లను హ్యాష్ ట్యాగ్ జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.
ఒక దేశం కానీ ప్రాంతం కాని అభివృద్ధి చెందాలంటే రోడ్లు బాగుండాలి. కానీ వైకాపా పాలనలో రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా గర్భిణీలు ఆస్పత్రికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో నేను పర్యటించినప్పుడు రోడ్లు అధ్నానంగా ఉన్నాయి. వీటిపై పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై లాఠీ ఛార్జీలు, అరెస్టులు ప్రయోగిస్తున్నారు. అందుకే సెప్టెంబరు 2,3,4 తేదీల్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ పేరిట డిజిటల్ క్యాంపైన్ చేస్తాం. అప్పటికీ ప్రభుత్వంలో స్పందన రాకపోతే అక్టోబరు 2న మేమే సొంతంగా రోడ్లు బాగు చేసుకుంటాం. -పవన్ కల్యాణ్, జనసేన అధినేత
రహదారుల అధ్వాన పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రభుత్వం స్పందించేలా చేయాలని పవన్ అన్నారు. వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2న మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందామని సూచించారు.
ఇదీ చదవండి: Registration department: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన మరింత జాప్యం!