jal shakti ministry meeting: తెలంగాణకు నీటి వాటాల కేటాయింపుల కోసం అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం మూడో సెక్షన్ కింద ట్రైబ్యునల్‌కు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్రాన్ని కోరింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ అమలుపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో బీఆర్కేభవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
2020 అక్టోబర్‌లో జరిగిన అత్యున్నత మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సూచన మేరకు సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నామని.. వెంటనే ట్రైబ్యునల్‌కు నివేదించే విషయమై నిర్ణయం తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ కోరారు. ఈ అంశంపై న్యాయశాఖ సలహా కోరామన్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్... న్యాయసలహా అందగానే ఈ అంశాన్ని ట్రైబ్యునల్‌కు నివేదిస్తామన్నారు. సీతారామ, సమ్మక్కసాగర్, చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతురెడ్డి, మొడికుంటవాగు, చనాఖా - కొరాటా ప్రాజెక్టుల డీపీఆర్‌లను సెప్టెంబర్‌లో సమర్పించామని.. అవి ఇంకా కేంద్ర జలసంఘం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సోమేశ్ కుమార్ గుర్తుచేశారు. దానికి స్పందిస్తూ.. వాటిని త్వరలోనే క్లియర్ చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు.
రామప్ప-పాకాల లింక్, కాళేశ్వరం అదనపు టీఎంసీ, కంతనపల్లి, కందకుర్తి, గూడెం ఎత్తిపోతల పథకాలను అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో తప్పుగా పేర్కొన్నారని... వాటిని తొలగించాలని సీఎస్ కోరారు. గోదావరి నదిపై పెద్దగా సమస్యలు, ఉమ్మడి ప్రాజెక్టులు లేనందున బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సోమేశ్‌కుమార్ తెలిపారు. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ లేవనెత్తిన ఏపీ అక్రమ ప్రాజెక్టుల అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: