సీఎం జగన్ దిగ్భ్రాంతి: ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు చెల్లించాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గవర్నర్ ప్రగాఢ సానుభూతి..: చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రహదారి భద్రత విషయంలో ప్రయాణికులు, చోదకులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
చంద్రబాబు తీవ్ర విచారం...: లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెళ్లింట్లో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి : నిశ్చితార్థ వేడుకల వేళ ప్రమాదానికి గురై 8 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘాట్ రోడ్లలో రక్షణ గోడలను పటిష్టపరచాలని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి రాష్ట్రప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని సూచించారు.
ఇదీ చదవండి: Bus accident: నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. చిన్నారితో సహా ఎనిమిది మంది మృతి