ETV Bharat / city

నకిలీ డాక్యుమెంట్లతో పాస్​పోర్ట్.. యాసపై అనుమానంతో ఆరా - illegal bangladeshis got fake passports to enter in India

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎంత పకడ్బందీగా చేస్తున్నామని చెబుతున్నా.. వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి పాస్‌పోర్టుల జారీ ప్రక్రియను ప్రశ్నార్థకం చేస్తూనే ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌ కేంద్రంగా బయటపడిన దొంగ పాస్‌పోర్టుల కేసు ఇందుకు ఉదాహరణ. ఈ కుంభకోణానికి సూత్రధారి పరిమళ్‌ అనే బంగ్లాదేశీయుడిగా తెలంగాణ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

illegal bangladeshis got passports with fake documents
నకిలీ డాక్యుమెంట్లతో పాస్​పోర్ట్
author img

By

Published : Feb 22, 2021, 6:54 AM IST

2014లో బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా కోల్‌కతాకు వచ్చిన పరిమళ్ అనే వ్యక్తి‌ రెండు సంవత్సరాల తర్వాత బోధన్‌కు మకాం మార్చాడు. ఆయుర్వేదిక్‌ వైద్యుడిగా కొంతకాలం కొనసాగాడు. అద్దెకు దిగిన ఇంటి యజమానితో రెంటల్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. దాని ఆధారంగా ఆధార్‌కార్డు పొంది ఆపై పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశాడు. సులభంగానే పాస్‌పోర్టు జారీ కావడంతో పుణేలో ఉంటున్న తన సోదరుడినీ పిలిపించి పాస్‌పోర్టు ఇప్పించాడు. అప్పట్లో బోధన్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం ఏఎస్సై మల్లేశ్‌ సహకారంతో పకడ్బందీ ప్రణాళిక రచించాడు. అప్పటికే బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తన సన్నిహితులను బోధన్‌కు పిలిపించి ఇక్కడి నుంచే పాస్‌పోర్టులు జారీ చేయిస్తూ వచ్చాడు.

యాసపై అనుమానంతో ఆరా

ఏళ్ల తరబడి సాగుతున్న ఈ కుంభకోణం బయటపడిన విధానం ఆసక్తికరంగా ఉంది. గత నెల 24న శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు వచ్చిన ముగ్గురు ప్రయాణికులపై ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ ముగ్గురు వ్యక్తులు బంగ్లాదేశ్‌ యాసలో మాట్లాడుతుండటంతో అనుమానమొచ్చిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వారిని విచారించగా వారంతా పేర్లు మార్చుకొని తప్పుడు పత్రాలతో పాస్‌పోర్టులు పొందినట్లు తేలింది. వారిని బంగ్లాదేశ్‌కు చెందిన నితాయ్‌దాస్‌, మహ్మద్‌ హజిబుర్‌ రెహమాన్‌, మహ్మద్‌ రానామియాగా గుర్తించారు.

ఇద్దరు ఏఎస్సైల మచ్చిక

సైబరాబాద్‌, నిజామాబాద్‌ పోలీసుల దర్యాప్తులో బోధన్‌ ఎస్‌బీ ఏఎస్సైల బాగోతం వెలుగుచూసింది. తొలుత ఏఎస్సై మల్లేశ్‌ను (ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఎస్సై) పరిమళ్‌ మచ్చిక చేసుకున్నాడు. ఆ ఏఎస్సై ఇంటికి సమీపంలోనే పలు ఇళ్లను అద్దెకు తీసుకున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి పిలిపించిన విదేశీయులను ఎస్‌బీ విచారణ సమయంలో వాటిలో ఉంచేవాడు. ఎస్‌బీ విచారణను సజావుగా చేసినందుకు ఏఎస్సై మల్లేశ్‌కు నజరానాలు ముట్టజెప్పేవాడు. మల్లేశ్‌ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన ఏఎస్సై అనిల్‌నూ మచ్చిక చేసుకొని తన దందా కొనసాగించాడు. పాస్‌పోర్టుల విచారణ కోసం పెట్టిన 40 వరకు దరఖాస్తుల్లో పరిమళ్‌ నంబరే ఉన్నా గుర్తించలేదంటే మల్లేశ్‌, అనిల్‌ల బాగోతం అర్థమవుతుంది. దీంతో వారిద్దరిని రెండు రోజుల క్రితం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ఆధార్‌ కార్డుల విషయంలో పరిమళ్‌కు సహకరించిన బోధన్‌లోని మీసేవ కేంద్రం నిర్వాహకుడిని, పశ్చిమబెంగాల్‌కు చెందిన వీసా ఏజెంట్‌ను, పరిమళ్‌ను కటకటాల్లోకి పంపారు.

ఎల్‌వోసీ జారీకి సన్నాహాలు

తప్పుడు పత్రాలతో 72 పాస్‌పోర్టులు పొందినట్లు నిర్ధారణ కావడంతో వారి ఆచూకీ కనుగొనడంపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. వీరిలో ఇదివరకే 20 మంది వరకు విదేశాలకు వెళ్లిపోయినట్లు గుర్తించడంతో మిగిలిన వారు ఇక్కడే ఉన్నట్లు భావిస్తున్నారు. వీరందరి పాస్‌పోర్టులు రద్దు చేయాలంటూ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖ రాయడంతోపాటు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయాలని ఎఫ్‌ఆర్‌ఆర్‌వోకు సిఫారసు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.