IIT Hyd on Polavaram : ‘పోలవరం ప్రాజెక్టు వద్ద గేట్ల నిర్వహణ సరిగా లేకపోతే భద్రాచలం వద్ద నీటిమట్టం చాలా ఎక్కువగా ఉండటంతోపాటు ముఖ్యమైన ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతాయి. పోలవరం డ్యాం డిజైన్ చేసిన గరిష్ఠ వరద ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులకే కాదు. దాని తొలి డిజైన్ ప్రకారం.. 36 లక్షల క్యూసెక్కులకైనా తీవ్రత ఉంటుంద’ని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీహెచ్) అధ్యయనం పేర్కొంది. వరద తిరుగుజలాల (బ్యాక్‌వాటర్) ప్రభావం వరద వచ్చినంత తీవ్రంగా గానీ, అతి తీవ్రంగా వచ్చే ప్రవాహం లాగా ఉండదని, ఈ కారణంగా ప్రాణనష్టం అరుదైనా.. ఆర్థికనష్టం అధికంగా ఉంటుందని తెలిపింది.
IIT Hyd on Bhadradri Floods : ‘ముంపును, నష్టాన్ని నివారించడానికి పోలవరం డ్యాం గేట్లకు క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలి. ఎగువ ప్రాంత రక్షణ దృష్ట్యా ఇది చాలా ముఖ్యం. ప్రవాహానికి తగినట్లుగా గేట్ వాల్వులు సక్రమంగా మూయడం, తెరవడం చేయాలి. నది ప్రాంతంలో డ్రెడ్జింగ్ కూడా చేపట్టాలి’ అని ఈ అధ్యయనం సూచించింది.
Polavaram Effect on Bhadradri Floods : పోలవరం డ్యాం వద్ద ఏ స్థాయిలో వరద వస్తే బ్యాక్‌వాటర్ ప్రభావం ఎంత ఉంటుందన్న దానిపై మూడేళ్ల కిందట ఐఐటీహెచ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సి.ఆర్.అమర్‌నాథ్, తాడికొండ శశిధర్‌లు చేసిన ఈ అధ్యయనం అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది. పోలవరం ముంపుపై తెలంగాణ నీటిపారుదల శాఖ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా ఈ అధ్యయన వివరాలను పొందుపరిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలవరం డ్యాం లేనప్పుడు, ఉన్నప్పుడు భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం ఏ స్థాయిలో ఉంటుందో అధ్యయనకర్తలు తమ నివేదికలో పొందుపరించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
పెద్ద డ్యాంల డిజైన్లు సరిగా లేనప్పుడే బ్యాక్‌వాటర్ వల్ల మునిగిపోవడం, నష్టాలకు గురికావడం వంటి పర్యవసానాలు ఉంటాయి. ధవళేశ్వరం వద్ద అత్యధిక వరద 1986 ఆగస్టు 16న 31.78 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. అదే రోజు ధవళేశ్వరం వద్ద అత్యధిక వరద మట్టం 18.36 మీటర్లు కాగా, పోలవరం వద్ద 28.01 మీటర్లు, కూనవరం వద్ద 51.3 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 60.25 మీటర్లు, భద్రాచలం వద్ద 55.66 మీటర్లుగా నమోదైంది. వాతావరణంలో మార్పులు, అతి తీవ్రమైన వర్షపాతాలు భవిష్యత్తులో పెరుగుతాయి.
కృష్ణానదికి వందేళ్లలో ఎప్పుడూ 10.6 లక్షల క్యూసెక్కులకు మించి వరద రాకపోగా, 2009లో 24.8 లక్షల క్యూసెక్కులు రావడమే దీనికి నిదర్శనం. వందేళ్లలో గోదావరికి వచ్చిన గరిష్ఠ వరద ప్రవాహం 31.78 లక్షల క్యూసెక్కులు కాగా, పోలవరం డ్యాంను 36 లక్షల క్యూసెక్కులకు డిజైన్ చేశారు. కేంద్ర జలసంఘం గరిష్ఠ వరద అంచనా (పి.ఎం.ఎఫ్) 50 లక్షల క్యూసెక్కులుగా నిర్ధరించగా, దీనికి తగ్గట్లు పోలవరం డ్యాం స్పిల్‌వేను రీ డిజైన్ చేశారు. కృష్ణా లాంటి పరిస్థితే గోదావరిలో వస్తే 80 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వెల్లువెత్తే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది.
371 గ్రామాలకు ముంపు.. 'పోలవరం డ్యాం వల్ల మొదట 276 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా వేయగా, తర్వాత ఈ సంఖ్య 371కి పెరిగింది. 97 వేల ఎకరాల సాగుభూమి ముంపులో పోతుంది. గత దశాబ్దకాలంలో పెరిగిన జనాభాను కూడా పరిగణనలోకి తీసుకొంటే నిర్వాసితుల సంఖ్య నాలుగు లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు’ అని అధ్యయనంలో పేర్కొన్నారు.
వెయ్యి, పదివేల సంవత్సరాలకోసారి వచ్చే అవకాశం ఉన్న వరద, నీటి విడుదల (డిశ్ఛార్జి)ను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం జరిగింది. పోలవరం డ్యాం ప్రాంతం నుంచి భద్రాచలం 118 కి.మీ. దూరం. అధ్యయన ప్రాంతంలో.. గోదావరితో కూనవరం వద్ద శబరి జలాలు కలుస్తాయి. కూనవరం పోలవరం డ్యాంకు 35 కి.మీ. దూరంలో ఉంది.
ఈ అధ్యయన విధానాల్లో.. 1డి స్టెడీ స్టేట్ కండిషన్ ప్రకారం పోలవరం డ్యాం ఉన్నప్పుడు, లేనప్పుడు వచ్చే ప్రవాహం, డిశ్ఛార్జిని పరిగణనలోకి తీసుకొంటే భద్రాచలంలోని ప్రధాన ప్రాంతాలన్నీ ముంపునకు గురికావడంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు నీటిలో ఉంటాయని నివేదిక పేర్కొంది. 2డి అన్‌స్టెడీ స్టేట్ కండిషన్ ప్రకారం వాటర్ సర్ఫేస్ ఎలివేషన్ డ్యాం ఉన్నప్పుడు వెయ్యేళ్ల వరదను తీసుకొంటే భద్రాచలం వద్ద 59.11 మీటర్లు, పదివేల ఏళ్లకోసారి తీసుకొంటే 60.89 మీటర్లని, అదే డ్యాం లేకుండా 58.29 మీటర్లు, 59.98 మీటర్లు అని అధ్యయనం పేర్కొంది.