జీఎంవోను(జెనిటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్‌ను) జన్యుమార్పిడిగా వ్యవహరిస్తారు. ఈ విధానంలో మొక్కల్లోని జన్యువులను పూర్తిగా వేరే జన్యువులతో మార్పుచేస్తారు. మొక్కలో ఉన్న జన్యువులోనే మార్పు తీసుకురావడం ఇప్పుడు అభివృద్ధి చేసిన కొత్త విధానం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ సైన్సెస్ ఆచార్యుడు ఆర్‌పీ శర్మ, అసోసియేట్ ఆచార్యురాలు ఎల్లమరాజు శ్రీలక్ష్మి నేతృత్వంలో దేశీయ టమాటా రకాల్లో నాణ్యత, పోషకాల పెంపుపై చేపట్టిన పరిశోధన విజయవంతమైంది. ఈ పరిశోధన ఫలితాలు ఇంగ్లండ్‌కు చెందిన ‘ది ప్లాంట్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి.
100గ్రాముల టమాటాల్లో లైకోపిన్(మి.గ్రా.)
సాధారణ రకంలో - 30
ఉత్పరివర్తనం చేసిన దాంట్లో - 120
త్వరగా లేదా ఆలస్యంగా పండేలా..
టమాటా పండేందుకు అమినో సైక్లోప్రొపేన్ కార్బోక్సిలిక్ యాసిడ్ సింథేజ్2(ఎస్‌సీఎస్2) ఎంజైమ్ కీలకం. దీని కారణంగా టమాట దానంతట అదే ఇథిలిన్ గ్యాస్‌ను ఉత్పత్తి చేసుకుని, పండుతుంది. ఆర్‌పీ శర్మ నేతృత్వంలోని పరిశోధక బృందం ఏసీఎస్2 ఎంజైమ్‌లో రెండు వేర్వేరు రకాల మ్యుటేషన్లు చేసింది. ఇథిలిన్ ఉత్పత్తిని నియంత్రించి టమాటాలు నిర్దేశిత కాలానికంటే ముందుగా పండేలా లేదా ఆలస్యంగా పండేలా చేయగలిగారు. సాధారణంగా ఈ పంట 90 రోజుల్లో చేతికి వస్తుంది. మ్యుటేషన్ చేసిన ఒక రకం వంగడం ద్వారా 70 లేదా 75 రోజుల్లోనే పండి కోతకు వస్తాయి. మరో రకం పది రోజులు ఆలస్యంగా పండుతాయి. ఉత్పరివర్తనం కోసం ఇథైల్ మిథేన్ సల్ఫోనేట్‌ను వినియోగించామని, టమాటా రంగు సైతం పెరిగిందని శర్మ వివరించారు.
మన వద్ద పండే రకాలతో ప్రయోగం
టమాటాలోని లైకోపిన్ అనే పోషక పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తుంది. మొక్కల్లోని ఫొటోట్రోపిన్-1 అనే ప్రొటీన్ సూర్మరశ్మి వైపు ఎదిగేలా చేస్తుంది. ఆకుల్లో ఉండే క్లోరోప్లాస్ట్‌ను ఒకచోటకు చేర్చుతుంది. ఆహారం తయారు చేసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలోని బృందం ఫొటోట్రోపిన్-1లో మ్యుటేషన్స్(ఉత్పరివర్తనాలు) చేసింది. దీనివల్ల టమాటాల్లోని లైకోపిన్‌ను మూడు రెట్లు పెంచగలిగింది. ఇందుకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో అధికంగా పండించే ఆర్కా వికాస్ వంగడాన్ని ఎంచుకుంది. లైకోపిన్ అధికం కావడం వల్ల టమాటాలు తక్కువ మోతాదుల్లో తిన్నా సరిపోతుందని శ్రీలక్ష్మి వివరించారు. పెద్ద పరిమాణంలో పండుతున్నాయన్నారు.
- ఇదీ చూడండి : తాజా తాజా కూరగాయలు... ఇంటి వద్దే పండించి తినేయరూ...!