మీది నిజంగా బాధాకరమైన పరిస్థితే. అలా బాధ పడుతూ కూర్చోకుండా సమస్యకు పరిష్కారం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. పదోతరగతి చదువుకునే రోజుల్లో ఆమె మీద ఎవరో పశువులు చేసిన అఘాయిత్యానికి ఆమె బాధ్యురాలు కాదు. ఈ విషయంలో ఆమెను సానుభూతితో అర్థం చేసుకుని, జాలి చూపించవచ్చు. అయితే పెళ్లికి ముందు చెప్పని ఈ విషయాన్ని ఇప్పుడు మీతో ఎందుకు చెప్పింది? బహుశా మీమీద నమ్మకంతో, మీరు అండగా నిలుస్తారనే భరోసాతో కావచ్చు. తన ప్రమేయం, తప్పు లేని ఈ విషయంలో ఆమెను పెద్ద మనసుతో క్షమించవచ్చు. ఇది సలహా ఇచ్చినంత తేలిక కాకపోయినా అంతకుమించి మరో మార్గం లేదు.
అయితే ఇప్పుడు కూడా ఆ అమ్మాయి మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేయడం హర్షించదగ్గ విషయం కాదు. అదే విషయం స్పష్టంగా, గట్టిగా చెప్పండి. తనలా చేయడం వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో వివరించండి. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాల్సింది భార్యాభర్తలే. మూడో వ్యక్తి కారణంగా ఇద్దరి మధ్యా కలతలు రావడం అంత మంచిది కాదనే విషయం తెలియజేయండి. తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అయినా పద్ధతి మార్చుకోకుంటే ఇరువైపులా పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడండి. చివరగా మీరు తీసుకోబోయే నిర్ణయం అభం శుభం తెలియని మీ కూతురు భవిష్యత్తుపై ప్రతికూలంగా ఉండొద్దనే ఆలోచన మనసులో పెట్టుకోండి.