హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన చేపట్టింది. భక్తులను వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు డిమాండ్ చేశారు. కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోకపోతే... ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా వీహెచ్‌పీ, భజరంగ దళ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాశీబుగ్గ కూడలిలో ధర్నా నిర్వహించారు. లేబర్ కాలనీ వద్ద నిర్వహించిన రాస్తారోకోతో... వరంగల్-నర్సంపేట రహదారిపై ట్రాఫిక్ జాం అయింది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో... నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కరోనాను కారణంగా చూపించి ఉత్సవాలను అడ్డుకుంటోందని భాజపా రాష్ట్ర నాయకుడు మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవడా వినాయక మండపం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనకు కృష్ణా, గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాధ్ మద్దతు తెలిపారు. మజ్లిస్ పార్టీకి తలొగ్గి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట, డీజిల్ కాలనీ, మడికొండ చౌరస్తాలో ప్లకార్డులు, కాషాయ జెండాలతో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హిందూ పండుగలపై ఆంక్షలు విధిస్తే రాష్ట్రానికే అరిష్టమని... భజరంగ్ దళ్ వరంగల్ విభాగ్ సంయోజన్ ఆళ్లకట్ల సాయి కుమార్ హెచ్చరించారు.
హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద జూబ్లీహిల్స్ నియోజనకవర్గ భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. మండపాల వద్ద భక్తులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని భాజపా నేత రావుల శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదన్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని ప్రధాన కూడలిలో... వీహెచ్‌పీ, భాజపా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. హిందూ పండుగలపై ఆంక్షలను సహించేంది లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అనేక మంది జీవనోపాధి కోల్పోయారని, హిందువుల విశ్వాసాలను గౌరవించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్లో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా... గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు.
నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద... వీహెచ్‌పీ, భాజపా, ఏబీవీపీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కరోనాను సాకుగా చూపి... ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. నాటి రజాకార్ల పాలనను తలపిస్తోందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో... గణేశ్ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, వీహెచ్‌పీ, భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో హిందూ పండుగలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కుపాదం మోపడం సరికాదన్నారు.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట... వీహెచ్‌పీ ఆద్వర్యంలో నల్ల జెండాలను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. గణేశ్ ఉత్సవాలను ప్రభుత్వం అణిచివేయాలని చూడటం సిగ్గుచేటని వీహెచ్‌పీ ప్రతినిధి గోపాలకృష్ణ ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గణేష్ మండపాలు తొలగించిన స్థలాల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హిందువులపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు... పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని భాజపా పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ అన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నల్లజెండాలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ... గణపతి నవరాత్రులు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆంక్షలు విధిస్తోందని హిందూ సమితి అధ్యక్షులు అడప నాగరాజు ఆరోపించారు.
ఆదిలాబాద్‌లో వీహెచ్‌పీ నాయకులు ధర్నా నిర్వహించారు. సమైక్యతా, సమగ్రతకు ప్రతిబింబమైన గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వం అనవసరంగా ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. జిల్లాలోనే ప్రసిద్ధి పొందిన కుమార్‌పేట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో... నిరసన కార్యక్రమం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు విరమించి... కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వినాయక విగ్రహం ముందు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కోవిడ్ నిబందనలకు అనుగుణంగానే ఉత్సవాలు చేస్తున్నందున... ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం చేయడానికి అనుమతించాలని కోరారు.
సికింద్రాబాద్ చిలకలగూడ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ పండుగలను అణిచివేసే కుట్రపన్నుతోందని బీజేవైఎం నాయకుడు భాస్కరాచారి ఆరోపించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో భాజపా నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హిందువులు మనోభావాలు దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ గౌడ్ అన్నారు.