గతంలో సినిమా ఎన్ని ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడితే.. అంత సక్సెస్ అందుకున్నట్టు లెక్క. కానీ.. రానురానూ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే.. అంత బ్లాక్ బస్టర్ అన్నమాట. సినిమా అంటేనే ఓ బిజినెస్. ఆ లెక్క ప్రకారం.. ఇప్పుడు ఈ లెక్కలే సక్సెస్ కు బెంచ్ మార్క్ అయ్యి కూర్చున్నాయి.
దాంతో.. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి.. థియేటర్లోంచి ఎత్తేసే దాకా.. ప్రతిపైసా లెక్కలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. మరి, ఈ లెక్కన తెలుగు సినీ చరిత్రలో.. ఇప్పటి వరకూ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలేవో మీకు తెలుసా? రండి.. ఓసారి చూద్దురుగానీ.. వికీపీడియా, గూగుల్, కొన్ని బాక్సాఫీస్ వెబ్సైట్ లెక్కల ప్రకారం.. ఈ వివరాలు అందిస్తున్నాం.
బాహుబలి 2 : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రానా.. ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది తెలుసుకునేందుకే.. ప్రతీ ప్రేక్షకుడు క్యూరియాసిటీతో థియేటర్లో అడుగుపెట్టాడంటే అతిశయోక్తి కాదు.
బాహుబలి తొలిపార్ట్ సక్సెస్‌తోపాటు.. కట్టప్ప ఎపిసోడ్ ఆడియన్స్‌ను అనివార్యంగా థియేటర్‌కు వచ్చేలా చేసింది. ఈ మూవీ సాధించిన కలెక్షన్లే అందుకు నిదర్శనం.
పోటెత్తిన ప్రేక్షకులతో.. బాక్సాఫీస్ బద్దలైపోయింది. ఫలితంగా.. బాహుబలి ది కన్‌క్లూజన్ వరల్డ్ వైడ్‌గా 1,810 కోట్ల రూపాయలు వసూలు చేసి.. తెలుగు సినీ చరిత్రలోనే.. ఇప్పటి వరకూ అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోయింది.
RRR : ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా.. జక్కన్న చెక్కిన మరో సెల్యూలాయిడ్ వెపన్ "ఆర్ఆర్ఆర్". అల్లూరిగా చరణ్.. భీమ్‌గా జూనియర్ పండించిన అద్వితీయ నటనకు యావత్ సినీ ప్రపంచం ఫిదా అయిపోయింది.
మన దేశంలోని సినీ అభిమానులే కాకుండా.. హాలీవుడ్ దిగ్గజాలు సైతం అర్అర్అర్ చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు ఆస్కార్ రేసుకోసం అంటూ అఫీషియల్‌గా క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర బృందం.
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం.. కలెక్షన్లలోనూ కుంభస్థలాన్ని కొట్టింది. ఏకంగా.. రూ.1200 కోట్లు వసూలు చేసి.. తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-2 చిత్రంగా నిలిచింది.
బాహుబలి 1 : అప్పటి వరకూ ఎన్నడూ చూడని విజువల్స్తోపాటు.. అద్భుతమైన కథ, కథనంతో.. భారతీయ సినీ అభిమానులను అలరించిన చిత్రం బాహుబలి ది బిగినింగ్.
విజువల్ వండర్లా సాగిన ఈ చిత్రం.. ప్రతీ ప్రేక్షకుడికీ మధురానుభూతిని మిగిల్చింది.
2015లో విడుదలైన ఈ మూవీ.. అప్పుడు కొల్లగొట్టిన కలెక్షన్స్‌తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా మొత్తం.. 650 కోట్లు రాబట్టింది.
అనంతరం వచ్చిన ఈ మూవీ సీక్వెల్ బాహుబలి-2తో రెండో ప్లేస్‌కు వెళ్లింది. లేటెస్ట్గా వచ్చిన ఆర్ఆర్ఆర్తో మూడో స్థానంలో నిలిచింది.
ఈ టాప్-3 చిత్రాలు రాజమౌళి చెక్కినవే కావడం గొప్ప విషయం. అతని టాలెంట్‌కు ఇంతకన్నా నిదర్శనం ఏముంది?
సాహో : బాహుబలి సిరీస్ తర్వాత.. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. బాహుబలి-2 తర్వాత రెబల్ స్టార్ నటించిన మూవీ "సాహో".
తెలుగునాట ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోనప్పటికీ.. బాలీవుడ్లో మాత్రం ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ.. ఏకంగా 439 కోట్లు సాధించి.. టాలీవుడ్లో టాప్-4లో నిలిచింది.
పుష్ప : అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం సాధించింది.
"తగ్గేదే లే" అంటూ.. పుష్పరాజ్ క్యారెక్టర్ చూపించిన మేనరిజం.. ఓ వేవ్‌లో సినీ లోకాన్ని తాకింది.
కలెక్షన్స్ కూడా అదేవిధంగా వచ్చిపడ్డాయి. బన్నీ తొలి పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప.. రూ.355 కోట్లు రాబట్టి.. 5వ స్థానంలో నిలిచింది.
అలవైకుంఠపురములో : గురూజీ త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
కనీవినీ ఎరుగని రీతిలో హిట్ కొట్టిన మ్యూజిక్ ఆల్బమ్.. అలవైకుంఠపురములో సక్సెస్‌లో మేజర్ పాత్రపోషించింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా.. 262 కోట్లు రాబట్టి.. టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన 6వ సినిమాగా నిలిచింది.
సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్.. అనిల్ రావిపూడి టేకింగ్‌తో.. నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిన మూవీ ఇది.
ఓవైపు నవ్వులు.. మరో వైపు సీరియస్‌గా కొనసాగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్నే అందుకుంది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 260 కోట్లు రాబట్టి 7వ స్థానం దక్కించుకుంది.
సైరా : మెగాస్టార్ కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన హిస్టారికల్ మూవీ సైరా.
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 240.60 కోట్ల గ్రాస్ సాధించి 8వ స్థానంలో నిలిచింది.
ఇప్పటి వరకూ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది.
రంగస్థలం : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం రంగస్థలం.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మూవీ.. 216 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో 9వ స్థానంలో నిలిచింది.
భరత్ అను నేను : కొరటాల శివ-మహేష్ బాబు కాంబోలో రూపొందిన ఈ మూవీ.. మహేష్ కెరీర్లో క్లాస్ మూవీగా నిలిచింది.
రాజకీయాలను ప్రక్షాళన చేసే యంగ్ లీడర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా 187.6 కోట్ల గ్రాస్ రాబట్టి.. టాలీవుడ్లో టాప్-10లో నిలిచింది.