నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు రుసుములు వసూలు చేస్తే... వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు, అధిక ఫీజులపై హైదరాబాద్ స్కూల్ పేరంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిదో తరగతి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ తెలిపారు. ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యాక ఆన్‌లైన్ తరగతుల అంశంపై విచారణ జరపాల్సిన అవసరమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. జూన్ 6 నుంచి జనవరి 31 వరకు ఆన్ లైన్ తరగతులపై పరిణామాలకు మాత్రమే విచారణ పరిమితం చేస్తామని హైకోర్టు తెలిపింది.
ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. జీవో 46 ప్రకారం బోధన రుసుములు మినహా ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదని తెలిపారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన తర్వాత కూడా గ్రంథాలయం, అభివృద్ధి, ఇతర ఫీజులు తీసుకోకూడదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడున్న జీవోల ప్రకారం తీసుకోరాదని న్యాయవాది తెలిపారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు కూడా చూడాలి కదా అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
కొన్ని పాఠశాలలు జీవో ఉల్లంఘించినట్లు పాఠశాల విద్యా కమినర్ విచారణ నివేదికను హైకోర్టుకు సమర్పించారని న్యాయవాది తెలిపారు. వ్యాజ్యానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు రికార్డులో అందుబాటులో లేకపోవడం వల్ల విచారణను ఏప్రిల్ 23కి వాయిదా వేసింది. అప్పట్లోగా ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తాయని.. కొంచె త్వరగా విచారణ జరపాలని న్యాయవాది కోరారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తే వెనక్కి ఇచ్చేలా ఆదేశిస్తామని హైకోర్టు తెలిపింది.