రాష్ట్రంలో పరువు హత్యల దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. పరువుహత్యలపై సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
పరువు హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తున్నామని డీజీపీ నివేదించారు. పరువు హత్యలు ఎన్ని జరిగాయి.. వాటి దర్యాప్తు ఏ స్థితిలో ఉంది.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎలా అమలు చేస్తున్నారో వివరించాలని హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 5లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.